మంచిర్యాల, మహా : త్యాగదనుల కృషి ఫలితంగానే భారతదేశానికి స్వతంత్రం సిద్ధించిందని ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ లు స్పష్టం చేశారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ
భారతదేశ పౌరులు, మహనీయుల కృషి, పోరాట పటిమ, ప్రాణత్యాగాల ఫలితంగా 1947వ సంవత్సరంలో దేశానికి స్వాతంత్ర్యం సాధించుకోవడం జరిగిందని వెల్లడించారు. దీని ద్వారా భారత ప్రజలకు స్వేచ్ఛా, సమానత్వం, సార్వభౌమత్వం ఏర్పడిందని స్పష్టం చేశారు.
ఆ తర్వాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి బాటలు వేశారని వెల్లడించారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విచ్చేసిన జిల్లాలోని ప్రజాప్రతినిధులకు, స్వతంత్ర సమరయోధులకు, పుర ప్రముఖులకు, అధికారులకు, ఉద్యోగులకు, విద్యార్థినీ, విద్యార్థులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ అధికారులు నిరంతరం జిల్లాలో పర్యటిస్తూ, ప్రభుత్వ పథకాలను పర్యవేక్షిస్తూ, అభివృద్ధిలో జిల్లాను ముందుకు తీసుకెళుతున్నారని తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలనే లక్ష్యంతో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యచరణలో భాగంగా 6 గ్యారంటీలలోని మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలు లబ్ది పొందారని, ఈ పథకంతో నిత్యం ప్రయాణించే మహిళలకు సగటున నెలకు 4 వేల రూపాయల నుండి 5 వేల రూపాయల వరకు ఆదా అవుతుందన్నారు. నగదు రహిత చికిత్స, రోగికి ఉచిత ఆహారం, రవాణా చార్జీలు చెల్లించడంతో పాటు 126 రకాల చికిత్సలకు ఒక సంవత్సర కాలం ఉచితంగా మందులు అందించడం జరుగుతుందని తెలిపారు. గృహజ్యోతి పథకం క్రింద అర్హత గల లబ్దిదారుల ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం క్రింద అర్హత గల వారికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందని వివరించారు.
మహిళలను అన్ని రంగాలలో ప్రోత్సహించే విధంగా రూపొందించిన మహిళా శక్తి పథకంలో గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్ తయారీకి అవకాశం ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా మైక్రో ఎంటర్ప్రైజెస్, మీ-సేవ కేంద్రాలు, ఈవెంట్ మేనేజ్మెంట్, క్యాంటీన్లు, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాలు, పాడి పశువులు, చేపలు, కోళ్ళ పెంపకం, మిల్క్ పార్లర ఇతరత్రా యూనిట్ల మంజూరు కొరకు అందిన దరఖాస్తులను పరిశీలించి, అర్హత గల యూనిట్ల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు.జిల్లాలో అర్హత కలిగిన ప్రతి లబ్దిదారుడికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించడం కోసం జిల్లా అధికార యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తున్నదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ, రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేయడం జరుగుతుందని, జిల్లాలో రైతులను రైతుభీమా ప్రయోజనం క్రింద చేర్చడం జరిగిందని, రైతు రుణమాఫీ పథకం కింద రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందని వివరించారు. అనంతరం వివిధ శకటాల ప్రదర్శన నిర్వహించారు, పాఠశాలలోని పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు దేశభక్తిని పెంపొందించే జాతీయ గీతాలాపనలు, వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన స్టాళ్లు ప్రత్యేకంగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.








