Mahaa Daily Exclusive

  విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించాలి — మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..!

Share

మంచిర్యాల, మహా, సెప్టెంబర్ 23 : మంచిర్యాల జిల్లా ప్రభుత్వ పాఠశాలలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్య పట్ల ప్రత్యేక దృష్టి సారించారని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ యాదయ్య, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అనిత, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, జిల్లా మేనేజర్ శ్రీకళ, మండల విద్యాధికారులు, అసిస్టెంట్ ఇంజనీర్లతో ప్రధానమంత్రి పోషణ్ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నిత్యం పౌష్టికాహారం అందజేసి, వారి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. జిల్లాలో 747 పాఠశాలలో 34 వేల 818 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం క్రింద మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించడంతో పాటు రోజు విడిచి రోజు కోడిగుడ్డు అందించడం జరుగుతుందని వివరించారు.
1 వ తరగతి నుండి 8 వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం చెల్లింపులు జూలై – 2025 వరకు జరిగాయని అన్నారు. మిగతా బిల్లులు త్వరలోనే చెల్లించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ పథకానికి సంబంధించిన బిల్లులు నిర్ణీత గడువులో ఇవ్వాలని సూచించారు. జిల్లాలో దాదాపు 78 శాతం విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం కింద లబ్ధి పొందుతున్నారని చెప్పారు. ఈ పథకం 100 శాతం విద్యార్థులకు అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో 11 శాతం పాఠశాలలలో మాత్రమే కిచెన్ గార్డెన్స్ అందుబాటులో ఉన్నాయని, పాఠశాలలలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో కిచెన్ గార్డెన్స్ (స్కూల్ న్యూట్రిషన్ గార్డెన్) ఏర్పాటు చేసేలా కృషి చేయాలని తెలిపారు. జిల్లా విద్యాధికారి, మండల విద్యాధికారులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు తమ పరిధిలోని పాఠశాలను సందర్శిస్తూ మధ్యాహ్నం భోజన పథకం నిర్వహణపై పర్యవేక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.