Mahaa Daily Exclusive

  ప్రభుత్వంపై ద్వేషమా..  బీసీలపై ప్రేమ లేదా? సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఫైర్.. 

Share

  • ప్రభుత్వంపై ద్వేషమా..
  • బీసీలపై ప్రేమ లేదా?
  • బీసీ రిజర్వేషన్ల అంశంలో అసలు దోషి బీజేపీ
  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఫైర్

 

హైదరాబాద్, మహా: బీసీ రిజర్వేషన్ల అంశంలో దోషి బీజేపీ .. వాళ్లకు మద్దతిస్తోంది బీఆర్ఎస్ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే ఇవ్వడంతో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. వారికి కనీసం బాధ కూడా లేదని విమర్శించారు. ఇది ప్రభుత్వంపై ద్వేషమా.. బీసీలపై ప్రేమ లేదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కూనంనేని మాట్లాడారు. ‘అసెంబ్లీలో మద్దతు తెలిపి ఇప్పుడు సన్నాయి నొక్కులు ఎందుకు? బీసీ బిల్లుకు మేం మద్దతిచ్చాం.. కేసులో కూడా ఇంప్లీడ్‌ అయ్యాం. మీరెందుకు కాలేదు. సుప్రీంలో 50శాతం దాటొద్దని తీర్పు ఉంది. 9వ షెడ్యూల్‌లో పెట్టడం ద్వారా తమిళనాడులో ప్రత్యేక పరిస్థితుల్లో అంతకంటే ఎక్కువ రిజర్వేషన్లు అమలుచేశారు. రాజ్యాంగాన్ని సవరించే అవకాశం కేంద్రానికి ఉన్నా చేయడం లేదు. బాధ్యత మొత్తం బీజేపీ పైనే ఉంది. కానీ డొంకతిరుగుడు రాజకీయాలతో ప్రజలను పార్టీ నేతలు గందరగోళానికి గురిచేస్తున్నారు. అన్ని పార్టీల నేతలను దిల్లీకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉంది. అవసరమైతే.. అన్ని పార్టీలతో జంతర్ మంతర్ వద్ద ధర్నా ఏర్పాటు చేయాలి. ఈ బిల్లు ఆమోదం పొందితే రిజర్వేషన్ల విషయంలో దేశవ్యాప్తంగా ముందడుగు పడుతుంది.’ అని కూనంనేని సాంబశివరావు అన్నారు.