Mahaa Daily Exclusive

  రూ. 5,000 కోట్ల ‘డబుల్ ధమాకా’

Share

  • రూ. 5,000 కోట్ల’డబుల్ ధమాకా’
  • చరిత్ర సృష్టించిన కొడంగల్
  • విద్య, సాగునీటి ప్రాజెక్టులపై సీఎం వరాలు
  • ‘దశదిశ’ మార్చేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలు
  • ఢిల్లీ నోయిడా తరహాలో తెలంగాణ నోయిడాగా కొడంగల్ చేస్తా
  • మెడికల్, వెటర్నరీ, వ్యవసాయ కాలేజీలు ఏర్పాటు చేయబోతున్నాం
  • ఇరిగేషన్ ప్రాజెక్టుకు భూసేకరణ పూర్తి.. ప్రతి ఎకరాకు నీరివ్వడమే లక్ష్యం
  • సొంత నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు

కొడంగల్, మహా: కొడంగల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్‌గా మార్చేందుకు రూ. 5 వేల కోట్లతో ఎడ్యుకేషన్ క్యాంపస్ నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో సోమవారం పర్యటించారు. గడిచిన 70 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన ఈ నియోజకవర్గాన్ని దేశం నలుమూలల నుంచి వచ్చి చూసేలా అభివృద్ధి చేసి, 2034 నాటికి దేశంలోనే ఒక ఆదర్శవంతమైన శాసనసభ నియోజకవర్గంగా తీర్చిదిద్దుకుందామని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం కొడంగల్‌లో హరేకృష్ణ ఉద్యమం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆధునిక అల్పాహార వంటశాలను పరిశీలించిన ముఖ్యమంత్రి, అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న మధ్యాహ్న భోజన వంటశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రూ. 103 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేసి, సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు చెక్కులు, చీరలను పంపిణీ చేశారు.

విద్య, నీటి పారుదల రంగాలను అభివృద్ధి..
ఆ తరువాత ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ, కొడంగల్‌ను ఒక మోడల్ నియోజకవర్గంగా మార్చే ప్రణాళికలను ఆవిష్కరించారు. ఆడబిడ్డలు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం ఆర్థికాభివృద్ధి సాధిస్తుందన్న విశ్వాసంతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా విద్య, నీటి పారుదల రంగాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుందని, అందుకు కొడంగల్‌ను ప్రయోగశాలగా ఎంచుకున్నామని చెప్పారు. అక్షయపాత్ర సహకారంతో నియోజకవర్గంలోని 312 పాఠశాలల్లో చదువుకుంటున్న 28 వేల మంది విద్యార్థులకు ఆకలితో చదువుపై శ్రద్ధ కోల్పోకుండా ఉండేందుకు ప్రతి రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు వివరించారు.

కొడంగల్‌ను తెలంగాణ నోయిడాగా..
మెడికల్ కాలేజ్, వెటర్నరీ, వ్యవసాయ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ వంటి వాటితో పాటు రాష్ట్రంలో మొట్టమొదటి సైనిక్ స్కూల్‌ను కొడంగల్‌లో ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. అలాగే, కృష్ణా నది జలాలతో కరువు ప్రాంతాలైన కొడంగల్, మక్తల్, నారాయణపేటలోని ప్రతి ఎకరాకు నీరివ్వడానికి రూ. 5 వేల కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభిస్తామన్నారు. భూ సేకరణకు 95 శాతం మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని, మంత్రివర్గ ఆమోదం పొందిన వెంటనే మూడు నెలల్లో పనులు మొదలవుతాయని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీ పక్కన ఉన్న నోయిడా మాదిరిగా కొడంగల్‌ను తెలంగాణ నోయిడాగా తీర్చిదిద్ది, అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తామని, ఇక్కడ రైల్వే మార్గం, సిమెంట్ పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి, నియోజకవర్గంలోని స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని 300 కోట్ల రూపాయల చెక్కును అందించారు. మంత్రులు దామోదర్ రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

కొడంగల్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన, ప్రారంభించిన వివిధ అభివృద్ధి పనుల వివరాలు (మొత్తం విలువ రూ. 103 కోట్లు):
• రూ. 5.83 కోట్లు: నియోజకవర్గంలో 28 అంగన్‌వాడీ భవనాల నిర్మాణం.
• రూ. 5.01 కోట్లు: నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 23 అదనపు తరగతి గదుల నిర్మాణం.
• రూ. 3.00 కోట్లు: నియోజకవర్గంలో 10 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం.
• రూ. 3.65 కోట్లు: బంజారా భవన్‌కు అదనపు సౌకర్యాలు (కాంపౌండ్ వాల్, డైనింగ్ హాల్, నీటి సరఫరా మరియు విద్యుదీకరణ).
• రూ. 1.00 కోటి: కొడంగల్‌లో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్‌కు శంకుస్థాపన.
• రూ. 1.30 కోట్లు: అగ్నిమాపక కేంద్రం నిర్మాణం.
• రూ. 1.40 కోట్లు: కొడంగల్‌లో స్విమ్మింగ్ పూల్ నిర్మాణం.
• రూ. 4.91 కోట్లు: కమ్యూనిటీ హాళ్లు, కిచెన్ షెడ్లు & కాంపౌండ్ వాల్స్ నిర్మాణం.
• రూ. 4.45 కోట్లు: సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీలు (యూజీడీలు) నిర్మాణం.
• రూ. 60.00 కోట్లు: కొడంగల్ పట్టణంలో రోడ్డు విస్తరణ.
• రూ. 5.00 కోట్లు: అతిథి గృహం నిర్మాణం.
• రూ. 4.50 కోట్లు: కోస్గి వ్యవసాయ మార్కెట్‌లో కొత్త అభివృద్ధి పనులు.
• రూ. 2.95 కోట్లు: అదనపు తరగతి గదులు, అంగన్‌వాడీ కేంద్రాలు & గ్రంథాలయ భవనాల ప్రారంభం.

Latest