బీజేపీ అహంకారం.. మిత్రపక్షాలకు ముప్పు.
*మహిళా రిజర్వేషన్ల కోసం మా సీట్లు త్యాగం.
*మెజార్టీ ఉందని ఏకపక్షంగా చట్టాలు చేస్తే కుదరదు.
• చంద్రబాబు పరిస్థితీ రేపు నితీష్, షిండేల మాదిరే.
* కేంద్రం తీరుపై సీఎం రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ, మహా.
భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న తీరు, జాతీయ రాజకీయాలు తదితర అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం తన రాజకీయ అహంకారాన్ని ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు. అదే సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీల మనుగడ భవిష్యత్తులో ప్రశ్నార్థకమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటన, మీడియాతో జరిగిన ఇష్టాగోష్టిలో ఆయన.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, ఏపీ సీఎం చంద్రబాబు భవిష్యత్తు, మహిళా సాధికారత తదితర అంశాలపై విస్పష్టమైన వైఖరిని కుండబద్దలు కొట్టారు.
**మహిళా బిల్లు ముసుగులో రాజ్యాంగాన్ని మార్చే కుట్ర**
మహిళా రిజర్వేషన్ల పట్ల తమకు పూర్తి చిత్తశుద్ధి ఉందని, అవసరమైతే ప్రస్తుతం ఉన్న స్థానాల్లోనే తమ సీట్లను త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. కానీ, మహిళా బిల్లును సాకుగా చూపి నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) పేరుతో సీట్లు పెంచి, తద్వారా రాజ్యాంగాన్ని మార్చాలని చూడటం అప్రజాస్వామికమని ఆయన మండిపడ్డారు. లోక్సభలో ఈ బిల్లు వీగిపోవడం బీజేపీ దురుద్దేశాలకు దక్కిన చెంపపెట్టుగా ఆయన అభివర్ణించారు. సభను గంటసేపు వాయిదా వేసి చట్టాలను సవరించే సత్తా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. సోమవారం నాడే సభను ప్రారంభించి మహిళలకు రిజర్వేషన్లు కల్పించే కొత్త చట్టాన్ని తీసుకురావాలని సవాలు విసిరారు. నియోజకవర్గాల పునర్విభజనతో పనిలేకుండా 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఈ ప్రక్రియను వెంటనే చేపట్టవచ్చని ఆయన సూచించారు.
**చంద్రబాబు పరిస్థితీ రేపు నితీష్, షిండేల మాదిరే..**
కేంద్రంలో పూర్తిస్థాయి మెజార్టీ లేకపోవడం వల్లే బీజేపీ ప్రస్తుతం జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రేవంత్రెడ్డి విశ్లేషించారు. భవిష్యత్తులో బీజేపీ సొంత బలం పెంచుకుంటే మాత్రం.. ఏమాత్రం సంకోచించకుండా టీడీపీని నిర్దాక్షిణ్యంగా పక్కనపెట్టడం ఖాయమని స్పష్టం చేశారు. ఇప్పటికే బిహార్లో నితీష్ కుమార్, మహారాష్ట్రలో ఏకనాథ్ షిండేల పరిస్థితిని చూస్తూనే ఉన్నామని, రాబోయే రోజుల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి కూడా ఇదే గతి పడుతుందని ఆయన జోస్యం చెప్పారు. బీజేపీతో జతకట్టిన ఏ ప్రాంతీయ పార్టీకీ దీర్ఘకాలంలో మనుగడ ఉండదన్న వాస్తవాన్ని గ్రహించాలని పరోక్షంగా హెచ్చరించారు.
**మెజార్టీ ఉందని ఏకపక్షంగా చట్టాలు చేస్తే కుదరదు**
లోక్సభ, రాజ్యసభలు కేవలం చట్టాలు రూపొందించడానికే పరిమితమని, వాటిని క్షేత్రస్థాయిలో ఆచరణలో పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. పార్లమెంటులో మూడింట రెండొంతుల (2/3) మెజార్టీ ఉన్నంత మాత్రాన ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తి తానే రాజునని భావించి ఇష్టానుసారంగా చట్టాలు చేస్తే ఈ దేశంలో ఎవరూ అంగీకరించరని స్పష్టం చేశారు. ఇదే తర్కాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్వయించిన ఆయన.. అక్కడ ప్రతిపక్షానికి కేవలం 11 సీట్లు మాత్రమే ఉన్నాయని, అంతమాత్రాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను చెప్పిందే చట్టం అని ఏకపక్షంగా ముందుకెళ్తే ప్రజలు ఒప్పుకోరని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో డిక్టేటర్షిప్ను (నిరంకుశత్వాన్ని) ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని రేవంత్రెడ్డి తేల్చిచెప్పారు.






