Mahaa Daily Exclusive

  చిరాగ్‌తో ప్రేమాయణం పుకారే…

Share

* మా మధ్య ఉన్నది కేవలం స్నేహమే.
* కంగనా రనౌత్ క్లారిటీ.
ముంబయి, మహా.
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్, ప్రస్తుత పార్లమెంట్ సభ్యురాలు కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో ఆమె ప్రేమలో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో జోరుగా సాగుతున్న ప్రచారానికి ఆమె స్వయంగా తెరదించారు. ఈ పుకార్లపై తనదైన శైలిలో స్పందించిన కంగనా.. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని, తమ మధ్య ఉన్నది కేవలం స్వచ్ఛమైన స్నేహం మాత్రమేనని తేల్చి చెప్పారు.
ఈ వివాదంపై కంగనా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “చిరాగ్ నాకు చాలా కాలంగా తెలుసు, ఆయన నాకు అత్యంత ఆప్తమిత్రుడు మాత్రమే. మా మధ్య ఎటువంటి ప్రేమాయణం లేదు. ఒకవేళ మా మధ్య నిజంగానే అటువంటి బంధం ఉండి ఉంటే, ఈ పాటికి మాకు పిల్లలు కూడా ఉండేవారు” అంటూ రూమర్లను చమత్కారంగా కొట్టివేశారు. తమ మధ్య ఉన్న అనుబంధం దశాబ్ద కాలానికి పైగా అలాగే కొనసాగుతోందని, అందులో ఎటువంటి మార్పు లేదని ఆమె స్పష్టం చేశారు. కేవలం స్నేహితులుగా ఒకరినొకరు గౌరవించుకుంటామని, అంతకు మించి మరేమీ లేదని కంగనా వివరించారు.
కంగనా రనౌత్, చిరాగ్ పాశ్వాన్ ఇద్దరూ కలిసి 2011లో విడుదలైన ‘మిలే నా మిలే హమ్’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా సెట్స్‌పై మొదలైన వీరి పరిచయం నాటి నుంచి నేటి వరకు స్నేహంగానే కొనసాగుతోంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా వీరిద్దరూ పార్లమెంటు ఆవరణలో పలుమార్లు ఆత్మీయంగా పలకరించుకోవడం చూసి సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వెలువడ్డాయి. తాజా వివరణతో కంగనా ఆ పుకార్లకు పూర్తిస్థాయిలో ఫుల్ స్టాప్ పెట్టారు.