Mahaa Daily Exclusive

  “అసలు పిక్చర్ ముందుంది”: కేజ్రీవాల్ క్లీన్ చిట్‌పై ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సంచలన వ్యాఖ్యలు

Share

  • కింది కోర్టు తీర్పుతో అయిపోలేదు
    .. అసలు పిక్చర్ ముందుంది
  • ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ, మహా
మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు కేవలం దిగువ కోర్టు ఇచ్చిన తీర్పు మాత్రమేనని, పై కోర్టుల్లో న్యాయం జరుగుతుందని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేసులో సాక్ష్యాధారాలను ఎలా తారుమారు చేశారో అందరికీ తెలుసని ఆరోపించిన ఆమె, “ఒకవేళ కేజ్రీవాల్ నిజంగా నిర్దోషి అయితే, విచారణ మొదలవ్వగానే ఆ మద్యం విధానాన్ని ఎందుకు వెనక్కి తీసుకున్నారు?” అని ప్రశ్నించారు. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు గతంలో కోర్టులు కూడా ఆందోళన వ్యక్తం చేశాయని ఆమె గుర్తు చేశారు. అలాగే కేజ్రీవాల్ ఇప్పటికీ ప్రజల ముందు డ్రామాలు చేస్తున్నారని, ఆప్ ప్రభుత్వంలో ఢిల్లీలో ఆయన చేసిన అభివృద్ధి శూన్యమని రేఖా గుప్తా విమర్శించారు. కేజ్రీవాల్ హయాంలో ప్రవేశపెట్టిన ప్రతి పథకంలోనూ ఏదో ఒక అవినీతి కుంభకోణం బయటపడుతూనే ఉందని మండిపడ్డారు. ఢిల్లీ ప్రజలు ఇప్పటికే ఆయనను ఎన్నికల్లో ఓడించి సరైన తీర్పు ఇచ్చారని, న్యాయస్థానం కూడా అంతిమంగా దోషులకు శిక్ష పడేలా న్యాయం చేస్తుందని తాను నమ్ముతున్నట్లు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మీడియాతో చెప్పుకొచ్చారు.

Latest