Mahaa Daily Exclusive

  మావోయిస్టుల లొంగుబాట్లపై అసెంబ్లీలో ప్రకటన…

Share

  • మావోయిస్టుల లొంగుబాట్లపై అసెంబ్లీలో ప్రకటన
  • ఆరుగురు కీలక నేతలతో సీఎం రేవంత్ చర్చలు
  • ప్రజాస్వామ్యం ద్వారా ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని గుర్తించడం అభినందనీయం
  • పొలిటికల్ అజెండా, పునరావాస ప్యాకేజీలపై చర్చలు

హైదరాబాద్, మహా : మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేతలతో సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు.

జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత చట్ట పరిధిలో వారు ఏదైనా చేసుకోవచ్చు. చట్టాలు ఉల్లంఘిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. మావోయిస్టుల లొంగుబాట్లపై అసెంబ్లీలో ప్రకటన చేస్తానని వెల్లడించారు. పొలిటికల్ ఎజెండాపైన దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి, సుజాతక్క, దామోదర్‌, చంద్రన్నలు సీఎం రేవంత్‌తో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఏడీజీ విజయ్ కుమార్, స్పెషల్ బ్రాంచీ ఐజీ సుమతి పాల్గొన్నారు. గతంలో సచివాలయంలోకి మాజీ మావోయిస్టులకు ఎంట్రీ ఉండేది కాదు. కానీ ఇపుడు మాజీ మావోయిస్టు నేతలకు సచివాలయంలోకి సాదర స్వాగతం పలకడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రజాస్వామ్యం ద్వారా ఆంకాంక్షలు నెరవేరుతాయి

సీఎం రేవంత్‌రెడ్డి లొంగిపోయిన మావోయిస్టుల నేతలను ప్రత్యేకంగా అభినందించారు. ఇన్నేళ్లుగా అడవుల్లో గడిపి ప్రజాస్వామ్య మార్గాన్ని ఎంచుకున్నందుకు అభినందనలు తెలిపారు. హింస సమాజంలోని ఏ సమస్యకూ శాశ్వత పరిష్కారం కాదన్నారు. ప్రజల ఆకాంక్షలు ప్రజాస్వామ్యం ద్వారానే నెరవేరుతాయన్న సీఎం మాజీ మావోయిస్టులకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. సంపూర్ణ భద్రత, గౌరవంగా జీవించేలా సదుపాయాలు కల్సిస్తామని చెప్పారు.

పొరుగు రాష్ట్రాల తరహాలో ప్యాకేజీ ఇవ్వండి

రెండేళ్లలో 591 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఈ సమావేశంలో డీజీపీ శివధర్‌ రెడ్డి వివరించారు. పోలీసుల సమన్వయం, ప్రభుత్వ పునరావాస విధానాలతో జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మాజీ మావోయిస్టు నేతలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సాయుధ పోరాటాన్ని వీడి ప్రధాన స్రవంతిలోకి వచ్చేందుకు అవకాశమిచ్చినందుకు ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పొరుగు రాష్ట్రాల తరహాలో మెరుగైన పునరావాస ప్యాకేజీలు కల్పించాలని మాజీ మావోయిస్టులు కోరారు. దీనికి సీఎం రేవంత్​ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఏడీజీ విజయ్ కుమార్, స్పెషల్ బ్రాంచీ ఐజీ సుమతి పాల్గొన్నారు.