- ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఏర్పాటు
- బేగంపేట ఎయిర్ పోర్ట్ రన్ వే ట్రాఫిక్ టన్నల్ ను అనుమతిస్తాం
- కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
న్యూఢిల్లీ, మహా : తెలంగాణలో మరో 2 కొత్త ఎయిర్‌పోర్టులు నిర్మించనున్నట్లు కేంద్రమంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆదిలాబాద్, నాగార్జున సాగర్ ప్రాంతాల్లో ఈ కొత్త విమానాశ్రయాలు రానున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉడాన్ 2.0 కింద ఈ నూతన ఎయిర్‌పోర్టులను నిర్మాణం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం కింద ఇప్పటికే ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌లను కొత్త ఎయిర్‌పోర్టులుగా కేంద్రం అభివృద్ధి చేస్తుందని స్పష్టం చేశారు.
తెలంగాణలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏకైక శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు అదనంగా మరిన్ని విమానాశ్రయాలను నిర్మించేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని, ఇందులో భాగంగానే వరంగల్ మామునూర్ ఎయిర్‌పోర్టు, కొత్తగూడెం విమానాశ్రయాలను నిర్మించాలని నిర్ణయించడం జరిగిందని గుర్తు చేశారు. తాజాగా ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో విమానాశ్రయాలను.. ఉడాన్ 2.0 కేంద్ర ప్రభుత్వ పథకం కింద నిర్మించేందుకు అవకాశం ఉందని తెలిపారు. దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రివర్గం గత వారం ఆమోదించిన ఉడాన్ 2.0 పథకం ద్వారా తెలుగు రాష్ట్రాలకు మరిన్ని ప్రయోజనాలు కలగనున్నాయని రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటికే ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌లను.. ఎయిర్‌పోర్టులుగా అభివృద్ధి చేసే వీలుందని తెలిపారు. ఇక తెలంగాణలోని ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో కొత్త ఎయిర్‌పోర్టులు నిర్మించేందుకు వీలుంటుందని కేంద్రమంత్రి వివరించారు. కడప, కర్నూలు ఎయిర్‌పోర్టుల నుంచి దేశ రాజధాని ఢిల్లీ సహా ఇతర కీలక నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ఈ ఉడాన్ పథకం ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం తర్వాత శనివారం రాత్రి తన నివాసంలో మీడియాతో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. ప్రస్తుతం కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న ఆదిలాబాద్ ఎయిర్‌ఫోర్స్ ఎయిర్‌స్ట్రిప్‌ను కేంద్ర విమానయాన శాఖ స్వాధీనం చేసుకోబోదని స్పష్టం చేశారు. మిగిలిన భూమిని సేకరించి అందులో ఎయిర్‌పోర్టును నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు.
బేగంపేట ఎయిర్‌పోర్టు రన్‌వే కింద ట్రాఫిక్ టన్నెల్‌కు అనుమతి ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. దీనికి అవసరమైన ఖర్చును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే అవసరమైన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలియజేశారు. ఉడాన్ 2.0 పథకం కింద కేటాయించిన రూ.28 వేల కోట్లలో 100 ఎయిర్‌పోర్టులను డెవలప్ చేసేందుకు రూ.12 వేల కోట్లను వినియోగిస్తామని స్పష్టం చేశారు. 200 హెలిపోర్టుల నిర్మాణానికి రూ.3,500 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. మరో రూ.10 వేల కోట్లు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఎయిర్‌లైన్స్ సంస్థలకు ఇవ్వనున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నిర్మాణం పూర్తి చేసుకున్న భోగాపురం ఎయిర్‌పోర్టు, విజయవాడలో విస్తరించిన ఎయిర్‌పోర్టులను రెండింటినీ జూన్ నెల వరకు అందుబాటులోకి తీసుకు వస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
మరోవైపు.. వరంగల్ సమీపంలో నిర్మిస్తున్న మామునూరు ఎయిర్‌పోర్టు ఫైల్ ఇప్పుడు అంతర్ మంత్రిత్వ శాఖల సంప్రదింపుల దశలో ఉందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ ఎయిర్‌పోర్టులో తమకు భాగస్వామ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోందని చెప్పిన కేంద్రమంత్రి.. కానీ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మించే ఎయిర్‌పోర్టుల్లో అలాంటి సంప్రదాయం లేదని స్పష్టం చేశారు. జూన్ నెలలో మామునూరు ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని వివరించారు.
అదే సమయంలో తెలంగాణలోని కొత్తగూడెం, బసంత్‌నగర్ ఎయిర్‌పోర్టులకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం చూపించిన స్థలం సరిగా లేదని చెప్పినట్లు గుర్తు చేసిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.. వాటి స్థానంలో మరో స్థలం చూపుతామని సర్కార్ చెప్పినట్లు తెలిపారు. దేశంలో విమానాల తయారీ పరిశ్రమ ఏర్పాటుపై ఎంబ్రాయిర్ సంస్థ 2,3 నెలల్లో నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. 2028 పూర్తయ్యే నాటి కల్లా దేశంలో తయారు చేసిన తొలి విమానాన్ని గాల్లోకి ఎగిరేలా చేయాలి అనేదే ఎంబ్రాయిర్ సంస్థ ఉద్దేశమని రామ్మోహన్‌నాయుడు తెలిపారు.








