- భూకబ్జాలపై హౌజ్ కమిటీ వేయాల్సిందే
- నా సొంత భూమిని కేటీఆర్ వదల్లేదు
- ఎవరికీ చెప్పుకోలేకపోయా
- అసెంబ్లీలో దానం నాగేందర్ ఆరోపణలు
హైదరాబాద్, మహా : మాజీ మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేకెత్తిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో వేల ఎకరాల భూమి కబ్జాలకు గురైందని ఆరోపించారు. ఇక తన సొంత భూమిని కేటీఆర్ బలవంతంగా మరొకరికి కట్టబెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ భూమిని కేటీఆర్ ప్రైవేటు కంపెనీలకు అప్పగించారని, అయినప్పటికీ తాను ఏమీ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదివారం అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ అదే సమయంలోనే ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో వేల ఎకరాల భూ కుంభకోణం జరిగినట్లు దానం నాగేందర్ ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా కేటీఆర్ తన సొంత భూమిని కూడా వదలకుండా కబ్జా చేశారని ఆరోపించారు. కేటీఆర్ చేసిన పనికి తమ బాధలను ఎవరికీ చెప్పుకోలేక గతంలో తాము నోరు మూసుకుని కూర్చున్నామని సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి కష్టపడి సంపాదించిన తమ సొంత భూమిని కూడా కేటీఆర్ ఒక ప్రైవేట్ కంపెనికీ అప్పగించినట్లు దానం నాగేందర్ పేర్కొన్నారు. అధ్యక్షా నేను హైదరాబాద్‍లో పుట్టి పెరిగా .. అయినప్పటికీ మౌనంగా ఉండిపోవాల్సిన దయనీయమైన పరిస్థితి ఏర్పడిందని దానం నాగేందర్ వెల్లడించారు. ఈ విషయంలో తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని.. కావాలంటే రికార్డులు కూడా చూపిస్తానని చెప్పారు. తాము ఎంత నష్టపోయాము అనేది తమకు మాత్రమే తెలుసని వెల్లడించారు. భూకుంభకోణాలపై హౌస్ కమిటీ వేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.








