- రాష్ట్రానికి వడగండ్ల ముప్పు.
- జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
- నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.
- 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు ప్రకృతి ప్రకోపం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అంచనా వేసింది. అకాల వర్షాల ప్రభావంతో పలు జిల్లాల్లో జనజీవనం అతలాకుతలం అయ్యే ప్రమాదం ఉండటంతో వాతావరణ కేంద్రం ‘ఆరెంజ్’ హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేసింది.
ముఖ్యంగా మంగళవారం (నేడు) ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాలపై వడగండ్ల ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ మరియు సిద్దిపేట జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, ఈదురు గాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అదేవిధంగా బుధవారం (రేపు) కూడా కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో వాతావరణం ఆందోళనకరంగానే ఉండనుందని, ఆయా జిల్లాలకు కూడా ఆరెంజ్ హెచ్చరికలు వర్తిస్తాయని అధికారులు వివరించారు.
రాజధాని హైదరాబాద్‌లోనూ వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇవాళ, రేపు నగరవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షం కురిసే ముందు బలమైన గాలులు వీస్తాయని, రాత్రి వేళల్లో ఉక్కపోత వాతావరణం కొనసాగుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఇప్పటికే కురుస్తున్న అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులు, తాజా హెచ్చరికలతో మరింత ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. ప్రయాణాల్లో ఉన్న వారు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని, సురక్షితమైన కట్టడాల నీడన ఉండాలని అధికారులు హితవు పలికారు.







