Mahaa Daily Exclusive

  ముత్యంపేటలో కోతుల మారణకాండ..!

Share

  •  విషప్రయోగంపై అనుమానం.
  •  అనుమానాస్పద స్థితిలో 20 కోతులు మృతి.
  •  నిలువునా ప్రాణాలు విడిచిన వానర సైన్యం.
  •  గతంలోనూ 30కి పైగా మృత్యువాత.
  •  ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా కదలని యంత్రాంగం

కామారెడ్డి (దోమకొండ), మహా.

కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో వానర సైన్యం మృత్యువాత పడటం కలకలం రేపుతోంది. గ్రామంలో మంగళవారం సుమారు 20 కోతులు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాయి. నోరులేని మూగజీవాలు ఇలా విగతజీవులుగా పడి ఉండటం చూసి స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో కోతుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటం గ్రామంలో చర్చనీయాంశమైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఆహారంలో విషం కలిపి పెట్టడం వల్లే ఈ ఘోరం జరిగి ఉంటుందని గ్రామస్థులు బలంగా అనుమానిస్తున్నారు.

గ్రామంలో ఇలాంటి ఘటనలు జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ ముత్యంపేటలో ఇదే తరహాలో సుమారు 30కి పైగా కోతులు విషాహారం తిని మృత్యువాత పడ్డాయి. వరుసగా మూగజీవాలు ప్రాణాలు కోల్పోతుండటంతో అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వానరాల మృతిపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని కోరుతూ సోమవారం కామారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో ఓ రైతు అధికారులకు ఫిర్యాదు చేశారు. కోతుల బెడద ఎక్కువగా ఉందని వాటిని చంపడం ఎంతవరకు న్యాయమని, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విన్నవించారు.

ఒకేసారి ఇన్ని సంఖ్యలో కోతులు మరణించడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి మృతి చెందిన కోతులకు పోస్టుమార్టం నిర్వహించి, అసలు కారణాలను వెల్లడించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఆహారంలో విషం కలిపి చంపడం నేరమని, అటవీ జంతువుల సంరక్షణకు చర్యలు చేపట్టాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించాల్సి ఉంది. వానరాల మరణాలతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Latest