Mahaa Daily Exclusive

  ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దందాపై కల్వకుంట్ల కవిత ఆగ్రహం: ప్రత్యేక అసెంబ్లీ పెట్టి చట్టం తేవాలని డిమాండ్!

Share

ప్రైవేట్ పాఠశాలల ‘ఫీజుల’ దందా.
* సామాన్యుడి నడ్డి విరుస్తున్న యాజమాన్యాలు.
* ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించి ఫీజు నియంత్రణ చట్టం తేవాలి.
* టీచర్లకు జీతాలు పెంచరు.. తల్లిదండ్రుల నుంచి వసూళ్లు మాత్రం ఆపరు.
* కల్వకుంట్ల కవిత ఆగ్రహం
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆమె, విద్యా రంగంలో నెలకొన్న అరాచకాలను ఎండగట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,061 ప్రైవేట్ పాఠశాలల్లో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతూ సామాన్య మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సీబీఎస్‌ఈ వంటి సెంట్రల్ సిలబస్ ఉన్న పాఠశాలల్లో విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే 25 నుంచి 30 శాతం మేర ఫీజులు పెంచి వసూళ్లు సాగిస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమని ధ్వజమెత్తారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫీజు నియంత్రణ చట్టం గురించి గొంతు చించుకున్న రేవంత్ రెడ్డి, నేడు అధికారంలోకి వచ్చాక ఆ అంశాన్ని పూర్తిగా విస్మరించడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
రాష్ట్రంలో మొత్తం 39,640 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, ప్రైవేట్ విద్యాసంస్థల నియంత్రణపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం లేదని కవిత ఆరోపించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి చర్చించకుండా కేవలం రాజకీయ విమర్శలతో కాలక్షేపం చేస్తున్నారని, తక్షణమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఒకవైపు తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు, మరోవైపు విద్యాబోధన చేస్తున్న టీచర్లకు మాత్రం కనీస స్థాయిలో జీతాలు పెంచడం లేదని దుయ్యబట్టారు. ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతను కూడా పట్టించుకునే నాథుడే లేడని, ప్రభుత్వం విద్యాసంస్థల పర్యవేక్షణలో ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై ఘాటైన విమర్శలు చేస్తూ, ఆయన ప్రైవేట్ పాఠశాలలు, ఆసుపత్రులను ప్రారంభిస్తూ వారి దోపిడీని ప్రోత్సహిస్తున్నారా అని కవిత ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని కీలక శాఖలకు ముఖ్యమంత్రే మంత్రిగా ఉండటం రాష్ట్ర దౌర్భాగ్యమని, దీనివల్ల ఏ శాఖలోనూ జవాబుదారీతనం లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. పొరుగు రాష్ట్రాల వారు లేదా ఉత్తరాది వారు ఇక్కడ విద్యాసంస్థలు నెలకొల్పినా, వాటిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల విషయంలో తెలంగాణ వారికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె స్పష్టం చేశారు. ఒకప్పుడు బీఆర్‌ఎస్ హయాంలో తనను నిజామాబాద్ జిల్లాకే పరిమితం చేశారన్న ఆమె, ఇప్పుడు ప్రజల పక్షాన నిలబడి రాష్ట్రవ్యాప్తంగా పోరాడుతానని వెల్లడించారు.
ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టే విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే సహించేది లేదని కవిత హెచ్చరించారు. యాజమాన్యాల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేయకుంటే తాము ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని, పాఠశాలల ముందు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యా రంగంలో సంస్కరణలు తీసుకురావడంలో అలసత్వం ప్రదర్శిస్తే భవిష్యత్తు తరాలు నష్టపోతాయని, కేవలం సంపన్నులకే విద్య పరిమితమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి ఫీజుల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

Latest