Mahaa Daily Exclusive

  మావోయిస్టులు లేరు….

Share

మావోయిస్టులు లేరు.
* ఇక గన్‌మెన్లు ఎందుకు?.
* వీఐపీ భద్రతపై డీజీపీ శివధర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు.
*ఆదిలాబాద్‌ మారుమూల గూడెాల్లో పోలీస్‌ బాస్‌ పర్యటన.
* ఆదివాసీలతో కలిసి భోజనం.
*చేతిలో సెల్‌ఫోన్‌ కాదు.. పుస్తకం ఉండాలి.
* యువతకు డీజీపీ హితవు..
ఆదిలాబాద్‌, మహా.
తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని, రాష్ట్రం ఇప్పుడు ముప్పు లేని ప్రశాంత ప్రాంతంగా మారిందని డీజీపీ శివధర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భద్రతా సమీకరణాల్లో కూడా భారీ మార్పులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు ప్రస్తుతం కల్పిస్తున్న భారీ భద్రతను పునఃసమీక్షించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన కుండబద్ధలు కొట్టారు. బుధవారం ఆదిలాబాద్‌ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా డీజీపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. భద్రతను ఒక్కసారిగా తొలగించడం సాధ్యం కాకపోయినప్పటికీ, విడతల వారీగా వీఐపీల సెక్యూరిటీని తగ్గించేలా పోలీస్ శాఖ పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో చాలా మందికి గన్‌మెన్ల అవసరం ఉండకపోవచ్చని, ఆ మేరకు పోలీసు బలగాలను ఇతర ప్రజా సేవల వైపు మళ్లించవచ్చని ఆయన సూచించారు.
ఆదిలాబాద్‌ జిల్లాలోని అత్యంత మారుమూల ప్రాంతాలైన చించుఘాట్, చోడేగాడ్ గూడెాల్లో డీజీపీ శివధర్‌రెడ్డి పర్యటించారు. ఒక ఉన్నతాధికారి హోదాలో కాకుండా, సామాన్యుడిలా ఆదివాసీలతో మమేకమయ్యారు. గూడెంలోని ఆదివాసీలతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేస్తూ, వారి కష్టసుఖాలను అత్యంత ఆత్మీయంగా అడిగి తెలుసుకున్నారు. ఆదివాసీల ఆచారాలు, సంస్కృతి ఈ దేశానికి ఎంతో గౌరవప్రదమని, అటువంటి గొప్ప వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన ఆకాంక్షించారు. ఇదే సందర్భంలో సామాజిక అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. “అంతరాలు లేని సమాజం” అనేది కేవలం పుస్తకాల్లో రాసుకోవడానికే బాగుంటుందని, వాస్తవ ప్రపంచంలో అది సాధ్యం కాదని ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఆదివాసీ పెద్దలతో సుదీర్ఘంగా చర్చించారు.
యువత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన డీజీపీ, ప్రతి ఊరికి ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. నేటి డిజిటల్ యుగంలో చేతిలో సెల్‌ఫోన్‌ లేకపోయినా పర్వాలేదు కానీ, చేతిలో ఒక పుస్తకం ఉండాలని ఆయన యువతకు హితవు పలికారు. జ్ఞానమే నిజమైన ఆయుధమని, చదువు ద్వారానే గూడెాల తలరాతలు మారుతాయని ఉద్ఘాటించారు. అనంతరం పోలీసు శాఖ తరపున స్థానిక యువతకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ప్రాణ రక్షణ కోసం రహదారి నిబంధనలను పాటించాలని, హెల్మెట్లను కేవలం ఇళ్లలో అలంకారప్రాయంగా ఉంచుకోకుండా వాహనం నడుపుతున్నప్పుడు తప్పనిసరిగా ధరించాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఆదివాసీలతో కలిసి డీజీపీ గడిపిన ఈ సమయం స్థానిక ప్రజల్లో కొత్త భరోసాను నింపింది.

Latest