*హైదరాబాద్‌ను ప్రమాద రహిత నగరంగా తీర్చిదిద్దుదాం.
*రోడ్డు సేఫ్టీ కమిటీ సభ్యులకు సీపీ సజ్జనర్ పిలుపు.
హైదరాబాద్, మహా.
హైదరాబాద్ నగరాన్ని ప్రమాద రహిత నగరంగా తీర్చిదిద్దడంలో రోడ్డు సేఫ్టీ కమిటీ సభ్యుల పాత్ర అత్యంత కీలకమని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ పేర్కొన్నారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా బుధవారం టీజీఐసీసీసీ ఆడిటోరియంలో నిర్వహించిన ‘అరైవ్ – అలైవ్’ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఖైరతాబాద్ జోన్ పరిధిలోని 10 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల నుండి సుమారు 400 మంది కమిటీ సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో రహదారి భద్రతపై కమిషనర్ కీలక సూచనలు చేశారు. వాహనదారులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడే భద్రతా నియమాలను ఒక పవిత్రమైన క్రతువులా పాటించాలని, అప్పుడే క్షేమంగా ఇళ్లకు చేరుకోగలరని ఆయన ఆకాంక్షించారు.
రహదారి ప్రమాదాల వల్ల కలిగే సామాజిక, కుటుంబ నష్టాలను సీపీ సజ్జనర్ ఈ సందర్భంగా వివరించారు. ఒక ప్రమాదంలో ఇంటి యజమాని మరణిస్తే ఆ కుటుంబం మొత్తం వీధిన పడుతుందని, అటువంటి విషాదకర పరిస్థితులు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. కేవలం జరిమానాల కోసం కాకుండా, ప్రాణ రక్షణ కోసమే నిబంధనలు పాటించాలని హితవు పలికారు. ప్రతి కాలనీ, అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు తమ ప్రాంగణాల్లో ‘నో హెల్మెట్ – నో ఎంట్రీ’ బోర్డులను ఏర్పాటు చేసి, నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సూచించారు. స్థానిక ట్రాఫిక్ సమస్యలను వాట్సాప్ గ్రూపుల ద్వారా అధికారుల దృష్టికి తీసుకువస్తే, ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుని తక్షణమే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
రోడ్డు ప్రమాద బాధితులను కాపాడే విషయంలో ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రహ్ వీర్’ స్కీం గురించి కమిషనర్ వివరించారు. బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడే వారికి ఈ పథకం ద్వారా నగదు పురస్కారంతో పాటు చట్టపరమైన రక్షణ కూడా లభిస్తుందని తెలిపారు. పోలీసులు గానీ, ఇతర వ్యవస్థలు గానీ సహాయం చేసిన వారిని ఇబ్బంది పెట్టవని, కాబట్టి ఎవరూ భయపడకుండా బాధితులకు సాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మానవత్వంతో స్పందించి ప్రాణాలు కాపాడటమే నిజమైన పౌర బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు.
ట్రాఫిక్ జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీస్ శాఖ బాధ్యత మాత్రమే కాదని, అది ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు. మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడటం వంటి చర్యలు ప్రాణాంతకమని హెచ్చరించారు. అనంతరం ట్రాఫిక్ డీసీపీ అవినాష్ కుమార్ ‘డిఫెన్సివ్ డ్రైవింగ్’ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సభ్యులకు అవగాహన కల్పించారు. రహదారిపై ఎదురయ్యే ప్రమాదకర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో వివరించారు. సదస్సు ముగింపులో రోడ్డు భద్రతా నియమాలను నిష్ఠగా పాటిస్తామని కమిటీ సభ్యులందరితో ప్రతిజ్ఞ చేయించారు.








