గృహజ్యోతి పథకానికి రూ. 2,080 కోట్లు విడుదల.
*200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు నిరంతరాయం.
*డిస్కంలకు నిధులు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు.
**హైదరాబాద్, మహా.
తెలంగాణలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘గృహజ్యోతి’ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. నెలవారీగా 200 యూనిట్ల వరకు గృహ వినియోగదారులకు అందజేస్తున్న ఉచిత విద్యుత్తు పథకానికి సంబంధించి 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 2080,38,74,000/- (రెండు వేల ఎనభై కోట్ల ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయలు) మంజూరు చేస్తూ ఇంధన శాఖ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. జీఓ ఆర్టీ నెంబర్ 09 పేరుతో విడుదలైన ఈ ఉత్తర్వుల ద్వారా రాష్ట్రంలోని విద్యుత్తు పంపిణీ సంస్థలైన టీజీ డిస్కంలకు సబ్సిడీ నిధులు అందనున్నాయి. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది లబ్ధిదారులకు ఎటువంటి అంతరాయం లేకుండా ఉచిత విద్యుత్ సౌకర్యం కొనసాగనుంది.
రాష్ట్ర ప్రభుత్వం గృహ వినియోగదారుల ఆర్థిక వెసులుబాటు కోసం ప్రవేశపెట్టిన ఈ పథకానికి బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇస్తోంది. తాజా ఉత్తర్వుల ప్రకారం, 2026 ఏప్రిల్ మాసం నుంచి ఈ నిధులను నెలవారీ అవసరాలకు అనుగుణంగా డిస్కంలు క్లెయిమ్ చేసుకోవచ్చని ఇంధన శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుత ఏప్రిల్ నెల సబ్సిడీ అవసరాల నిమిత్తం సుమారు రూ. 186.96 కోట్ల నిధులను తక్షణమే వినియోగించుకునేలా ట్రెజరీ అండ్ అకౌంట్స్ విభాగానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. వివిధ హెడ్ ఆఫ్ అకౌంట్ల ద్వారా ఈ నిధులను పారదర్శకంగా కేటాయించినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఆర్థిక శాఖ జారీ చేసిన బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఆధారంగా ఈ నిధుల విడుదలకు పాలనాపరమైన అనుమతులు లభించాయి. టీజీ ఎస్పీడీసీఎల్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ చేసిన అభ్యర్థన మేరకు ప్రభుత్వం స్పందించి ఈ నిధులను సకాలంలో విడుదల చేసింది. నియోజకవర్గాల వారీగా అర్హులైన ప్రతి కుటుంబానికి గృహజ్యోతి ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్తు శాఖ అధికారులకు ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. విద్యుత్తు సంస్థలు ఆర్థికంగా బలోపేతం కావడానికి మరియు వినియోగదారులకు సబ్సిడీ భారం లేకుండా చూడటానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.








