తెలంగాణ పోరాటాన్ని కించపరిస్తే ఖబడ్దార్.
• అమరవీరుల త్యాగం నీకు ఆటవస్తువా?
• నీళ్లు, నిధుల యుద్ధాన్ని విభజనతో పోలుస్తారా?
• తెలంగాణ ఆత్మగౌరవంపై దాడిని సహించం.
• తెలంగాణ బీజేపీ ఎంపీలారా నోరు విప్పండి.
• లేదంటే పదవులు వదిలి వెళ్ళండి.
• తేజస్వీ సూర్యపై కవిత కన్నెర్ర.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య పార్లమెంట్ సాక్షిగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. పవిత్రమైన తెలంగాణ ఉద్యమాన్ని భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చడాన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, బీజేపీ ఎంపీపై నిప్పులు చెరిగారు. ఆరు దశాబ్దాల పాటు వివక్షకు వ్యతిరేకంగా, ఆత్మగౌరవం కోసం కోట్లాది మంది ప్రజలు చేసిన ధర్మపోరాటాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదని ఆమె హెచ్చరించారు. తేజస్వీ సూర్య వ్యాఖ్యలు కేవలం ఒక రాజకీయ ప్రకటన కాదని, ఇది తెలంగాణ అస్తిత్వంపై, ఇక్కడి ప్రజల ఆకాంక్షలపై జరిగిన క్రూరమైన దాడి అని ఆమె అభివర్ణించారు. దేశ అత్యున్నత సభలో ఉండి, ఒక రాష్ట్రం ఏర్పడిన చారిత్రక నేపథ్యంపై కనీస అవగాహన లేకుండా మాట్లాడటం ఆయన అజ్ఞానానికి పరాకాష్ట అని కవిత ధ్వజమెత్తారు.
మిస్టర్ తేజస్వీ సూర్య.. తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం అంటే నీకు అంత చులకనా అంటూ కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వేలాది మంది యువతీ యువకులు ప్రాణాలర్పించి సాధించుకున్న రాష్ట్రాన్ని, దేశ విభజనతో పోల్చడం ద్వారా అమరవీరుల త్యాగాలను అవమానించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగిన ఈ మహోద్యమం వెనుక ఉన్న భావోద్వేగాలను అర్థం చేసుకోలేని వారు ప్రజాప్రతినిధులుగా ఉండటం దురదృష్టకరమని ఆమె విమర్శించారు. తెలంగాణ సంస్కృతిని, ఉద్యమ చరిత్రను తక్కువ చేసి మాట్లాడితే ఇక్కడి ప్రజలు సహించరని, పౌరుషాల గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డ నీ అహంకారపూరిత మాటలను తిప్పికొడతారని ఆమె స్పష్టం చేశారు. ఆత్మగౌరవం కోసం సాగిన ఈ పోరాటాన్ని కించపరచడం అంటే తెలంగాణ చరిత్రను కనుమరుగు చేయడమేనని ఆమె ఆరోపించారు.
ఇదే క్రమంలో రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీల తీరుపై కూడా కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సొంత పార్టీ ఎంపీ తెలంగాణ సమాజాన్ని, ఇక్కడి ఉద్యమ చరిత్రను ఇంతలా అవమానిస్తుంటే మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆమె నిలదీశారు. తెలంగాణ గడ్డపై ఓట్లు వేయించుకుని గెలిచిన మీకు, ఇక్కడి అస్తిత్వంపై దాడి జరుగుతుంటే స్పందించే ధైర్యం లేదా అని ప్రశ్నించారు. తేజస్వీ సూర్య వ్యాఖ్యలను మీరు మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నారా అని సూటిగా అడిగారు. వెంటనే తేజస్వీ సూర్యతో బహిరంగ క్షమాపణ చెప్పించాలని, లేనిపక్షంలో తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆమె హెచ్చరించారు. రాష్ట్ర గౌరవాన్ని కాపాడలేని ఎంపీలకు పదవుల్లో కొనసాగే నైతిక హక్కు లేదని, వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి తెలంగాణ పట్ల మీకున్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించి మాట్లాడటం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూడటం బీజేపీ కుట్రలో భాగమని కవిత విమర్శించారు. చారిత్రక సత్యాలను వక్రీకరించి ప్రజల మధ్య వైషమ్యాలు రేపే ప్రయత్నాలను తెలంగాణ సమాజం ఎన్నటికీ క్షమించదని ఆమె అన్నారు. ఈ గడ్డపై జరిగిన పోరాటం ఒక ధర్మయుద్ధమని, దానిని తక్కువ చేసే ప్రయత్నం చేసే ఎవరికైనా కాలమే సమాధానం చెబుతుందని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఇక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతీసే ఏ శక్తినైనా గట్టిగా ఎదుర్కొంటామని కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.







