Mahaa Daily Exclusive

  తెలంగాణ ఏర్పాటు దేశ విభజనా?: తేజస్వీ సూర్యపై హరీశ్‌రావు నిప్పులు – క్షమాపణకు డిమాండ్

Share

తెలంగాణ ఏర్పాటు దేశ విభజనా?.
* అమరవీరుల త్యాగాలపై అపహాస్యమా?
• ఢిల్లీ పెద్దల ముందు రాష్ట్ర గౌరవాన్ని తాకట్టు పెడతారా?
• ఢిల్లీలో గులాంగిరి వద్దు.. రాష్ట్ర గౌరవాన్ని కాపాడండి.
• పార్లమెంట్‌లో విషం చిమ్మిన తేజస్వీ సూర్యపై హరీశ్‌రావు నిప్పులు.
హైదరాబాద్, మహా.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య పార్లమెంట్ వేదికగా చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కోట్లాది మంది ఆకాంక్షలకు, వేలాది మంది బలిదానాలకు నిలువుటద్దం వంటి తెలంగాణ ఏర్పాటును రక్తపాతంతో కూడిన భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు తీవ్రంగా విరుచుకుపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచిన తేజస్వీ సూర్య వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దశాబ్దాల పాటు సాగిన ప్రజా ఉద్యమ ఫలితంగా, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఒక రాష్ట్రాన్ని దేశ విభజనతో పోల్చడం అమరవీరుల త్యాగాలను అగౌరవపరచడమేనని, ఇది బీజేపీ నాయకత్వానికి ఉన్న విద్వేషపూరిత మనస్తత్వానికి అద్దం పడుతోందని ఆయన మండిపడ్డారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు బీజేపీ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ భారత్-పాక్ విభజన వంటిదే అయితే, ఆనాడు పార్లమెంట్‌లో బీజేపీ ఈ బిల్లుకు ఎందుకు మద్దతు ఇచ్చిందని ఆయన సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ నేడు అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలవడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. సభలో బీఆర్ఎస్ ఎంపీలే గనుక ఉండి ఉంటే, తేజస్వీ సూర్య అనుచిత వ్యాఖ్యలను అక్కడికక్కడే అడ్డుకుని సంగతి తేల్చిపారేసేవారని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ప్రధాని మోదీ కూడా తెలంగాణ ఏర్పాటుపై ఇవే తరహా అవాకులు చవాకులు పేలారని, ఇప్పుడు ఆయన శిష్యుడిగా తేజస్వీ సూర్య అదే విషాన్ని చిమ్ముతున్నారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు పదేపదే తెలంగాణ అస్తిత్వాన్ని అవమానించడం పరిపాటిగా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీ మరియు కాంగ్రెస్ ఎంపీల మౌనాన్ని హరీశ్‌రావు తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి ఢిల్లీ గద్దెనెక్కిన వారు, అక్కడి పెద్దల ముందు రాష్ట్ర గౌరవాన్ని తాకట్టు పెట్టడం సిగ్గుచేటని విమర్శించారు. సొంత రాష్ట్రంపై ఇంతటి దారుణమైన వ్యాఖ్యలు జరుగుతున్నా నోరు విప్పని వీరికి ఎంపీలుగా కొనసాగే అర్హత లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి చేసే ఏ శక్తిని కూడా ఇక్కడి ప్రజలు క్షమించరని, త్యాగాల చరిత్రను తక్కువ చేసి మాట్లాడితే సహించే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. భవిష్యత్తులో తెలంగాణ ప్రజలే బీజేపీ నాయకులకు గుణపాఠం చెబుతారని, తక్షణమే తేజస్వీ సూర్య తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ కోరాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

Latest