తేజస్వీ సూర్య మాటల్లో అర్థం వేరు.
* బీఆర్ఎస్ రాద్దాంతం వెనుక కుట్ర వేరు.
* కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు బీఆర్ఎస్ తీరు.
* సూర్య వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు.
* చర్చకు దమ్ముందా? తెలంగాణ తెచ్చింది బీజేపీయే.
* బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదునైన విమర్శలు.
హైదరాబాద్, మహా.
తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు కావాలనే వక్రీకరిస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతల తీరు ‘కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు’ ఉందని ఎద్దేవా చేశారు. ఎంపీ తేజస్వీ సూర్య మాట్లాడిన మాటల్లోని అంతరార్థాన్ని గమనించకుండా, కేవలం ఒక అంశాన్ని పట్టుకుని భూతద్దంలో చూపుతూ రాష్ట్రంలో అనవసర ఉద్రిక్తతలు సృష్టించాలని చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్య ఎన్నడూ తెలంగాణను పాకిస్థాన్‌తో పోల్చలేదని, ఆయన ఉద్దేశం వేరని రామచంద్ర రావు స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రలో బీజేపీ పోషించిన కీలక పాత్రను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. “తెలంగాణ జేఏసీ లో బీజేపీ ఒక భాగస్వామిగా ఉండి ఉద్యమాన్ని ముందుండి నడిపించింది. పార్లమెంట్‌లో బీజేపీ మద్దతు ఇవ్వకుంటే అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్) పాత్రను కూడా ఆయన ఎండగట్టారు. లోక్‌సభలో తెలంగాణ బిల్లుపై అత్యంత కీలకమైన చర్చ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్‌కు చెందిన ఇద్దరు సభ్యులు సభలో లేరన్న నిజాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న యూ-టర్న్‌ల వల్లే తెలంగాణలో అనిశ్చితి ఏర్పడిందని, దాని ఫలితంగానే వందలాది మంది యువతీ యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మరణాలన్నింటికీ కాంగ్రెస్ పార్టీయే బాధ్యత వహించాలని ఆయన ధ్వజమెత్తారు.
వాజపేయి హయాంలో జరిగిన రాష్ట్రాల ఏర్పాటును రామచంద్ర రావు ఈ సందర్భంగా ఉదహరించారు. నాటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఎంతో సాఫీగా, ఒక్క రక్తపు చుక్క కూడా చిందకుండా ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ వంటి మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసి ఇచ్చారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఓట్ల రాజకీయం కోసం తెలంగాణ ఏర్పాటును జాప్యం చేస్తూ, రాష్ట్రంలో రక్తపాతానికి కారణమైందని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ అస్తిత్వంపై బీజేపీకి ఉన్న గౌరవం ఎనలేనిదని, శవ రాజకీయాలు చేయడం బీఆర్ఎస్‌కే చెల్లుతుందని రామచంద్ర రావు ఘాటుగా వ్యాఖ్యానించారు.








