తెలంగాణ ఏర్పాటు దేశ విభజనతో సమానమా?
• అంబేద్కర్ రాసిన ఆర్టికల్-3 నీకు తెలియదా?
• రాష్ట్ర గౌరవం మంటగలుస్తుంటే బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు?
• బీజేపీ ఎంపీ అజ్ఞానంపై మంత్రి పొన్నం నిప్పులు.
హైదరాబాద్, మహా.
దేశ అత్యున్నత చట్టసభ వేదికగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీలిమిటేషన్ అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో ఏపీ-తెలంగాణ విభజనను దేశ విభజనతో పోల్చడం ఆయన అజ్ఞానానికి పరాకాష్ట అని మంత్రి మండిపడ్డారు. తేజస్వీ సూర్యను ‘తెలివి లేని వెధవ’ అంటూ సంబోధించిన పొన్నం, అసలు రాజ్యాంగంపై ఆయనకు కనీస అవగాహన ఉందా అని ప్రశ్నించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం, అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన తెలంగాణను, రక్తపాతంతో కూడిన దేశ విభజనతో పోల్చడం ద్వారా కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అవమానించారని ఆయన ధ్వజమెత్తారు.
గతంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా సైతం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను తక్కువ చేసి మాట్లాడారని, ఇప్పుడు అదే బాటలో తేజస్వీ సూర్య విషం చిమ్ముతున్నారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. నాలుగు దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజలు చేసిన ఆత్మగౌరవ పోరాటాన్ని గుర్తించి, సోనియా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఇస్తే.. దానిని అవహేళన చేసే హక్కు బీజేపీ నేతలకు ఎవరిచ్చారని ఆయన నిలదీశారు. తెలంగాణను ఒక పక్కా వ్యూహం ప్రకారం కించపరచడం బీజేపీకి అలవాటుగా మారిందని, ఇలాంటి అడ్డగోలు వ్యాఖ్యలను తెలంగాణ సమాజం ఎంతమాత్రం సహించదని ఆయన హెచ్చరించారు. “ఖబడ్దార్ బిడ్డా.. తెలంగాణ ఏర్పాటుపై ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే సహించే ప్రసక్తే లేదు” అంటూ తేజస్వీ సూర్యను హెచ్చరించారు.
ఇదే క్రమంలో రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీల తీరుపై కూడా పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో తమ రాష్ట్రాన్ని, ప్రజల ఆకాంక్షను అంతలా అవమానిస్తుంటే.. రాష్ట్ర బీజేపీ నేతలకు కనీసం చీము నెత్తురు లేదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ పౌరుల ఓట్లతో గెలిచి ఢిల్లీకి వెళ్లిన మీరు, మీ కళ్ల ముందే రాష్ట్ర గౌరవం మంటగలుస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. తెలంగాణ బీజేపీ ఎంపీల మౌనం అంగీకారమేనా అని ఆయన సూటిగా అడిగారు. సొంత రాష్ట్ర అస్తిత్వాన్ని కాపాడలేని వారు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ఆయన దుయ్యబట్టారు.
ప్రజాస్వామ్యంలో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు అత్యంత ప్రమాదకరమని పొన్నం ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ గౌరవాన్ని తగ్గించేలా, ఒక రాష్ట్ర ఆవిర్భావ చారిత్రక నేపథ్యాన్ని కించపరిచిన తేజస్వీ సూర్యపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సభాపతికి విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో మరెవరూ తెలంగాణ ఆత్మగౌరవంపై నోరు పారేసుకోకుండా ఉండాలంటే ఇలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన స్పష్టం చేశారు. ఒక మంత్రిగా కాకుండా, ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ బిడ్డగా ఈ అగౌరవాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.








