Mahaa Daily Exclusive

  భగ్గుమన్న తెలంగాణ పౌరుషం: తేజస్వీ సూర్య ‘పాక్’ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్త ఆగ్రహం..

Share

భగ్గుమన్న తెలంగాణ పౌరుషం!
• తెలంగాణ ఆత్మగౌరవంపై తేజస్వీ ‘విద్వేష’ బాణం.
• ఉద్యమ గడ్డపై ఎగిసిన నిప్పులు.
• అమరవీరుల బలిదానాన్ని పాకిస్థాన్‌తో పోలుస్తారా?
• తెలంగాణ విభజనను పాక్ తో పోల్చిన బీజేపీ ఎంపీ.
• తేజస్వీ సూర్య తెలివిలేని వెధవ- మంత్రి పొన్నం ఫైర్.
• బీజేపీ నేతలకు తెలంగాణ ఉనికి అంటే కడుపు మంట- మంత్రి జూపల్లి భగ్గు.
• నీకు ఎంత ధైర్యం- తేజస్వీపై కవిత ఫైర్.
• తేజస్వీ పార్లమెంట్ వేదికగా క్షమాపణ చెప్పాల్సిందే – కేటీఆర్ .
• తెలంగాణ ప్రజల మనోభావాలు గాయపరచడమే- మాజీ మంత్రి హరీష్ ఫైర్.
• ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా తేజస్వీ వ్యాఖ్యల- కాంగ్రెస్ నేత కంది శ్రీనివాసరెడ్డి.
• భూతద్దంలో చూడొద్దు- బీజేపీ చీఫ్‌ రామచందర్ రావు.

హైదరాబాద్, మహా.

దేశ అత్యున్నత చట్టసభ వేదికగా, కోట్లాది మంది ఆకాంక్షల ప్రతిరూపమైన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని భారత్-పాకిస్థాన్ విభజనతో పోలుస్తూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ కార్చిచ్చును రాజేసాయి. డీలిమిటేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన నోటి నుంచి వెలువడిన ‘విద్వేషపు’ పదజాలం తెలంగాణ అస్తిత్వపు మూలాలను తాకింది. ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం, వేలాది మంది యువతీ యువకుల ప్రాణత్యాగాలు, గల్లీ నుంచి దిల్లీ దాకా సాగిన ధర్మయుద్ధం ఫలితంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఒక రాష్ట్ర ఉనికిని.. లక్షలాది మంది రక్తం చిందిన దేశ విభజన నాటి విషాదంతో పోల్చడం కేవలం రాజకీయ అజ్ఞానం మాత్రమే కాదు, అది తెలంగాణ గడ్డపై జరిగిన పవిత్ర ఉద్యమాన్ని ఘోరంగా అవమానించడమేనని మేధావి వర్గం గర్జిస్తోంది. చట్టసభలో కూర్చుని రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రాముఖ్యత తెలియని వ్యక్తి ప్రజాప్రతినిధిగా కొనసాగడం ప్రజాస్వామ్యానికే అవమానమని ఉద్యమకారులు మండిపడుతున్నారు.
తేజస్వీ సూర్య వ్యాఖ్యలు వెలువడిన నిమిషాల్లోనే తెలంగాణవ్యాప్తంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి. బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు హరీశ్‌రావు, కల్వకుంట్ల కవిత ఈ వ్యవహారంపై బీజేపీ అగ్రనాయకత్వాన్ని కడిగిపారేశారు. తెలంగాణ అంటే ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదని, అది కోట్లాది మంది ఆత్మగౌరవ ప్రతీక అని వారు గుర్తుచేశారు. పార్లమెంట్‌లో నాడు ఇదే బీజేపీ మద్దతుతో బిల్లు పాసైనప్పుడు లేని ‘పాకిస్థాన్’ పోలిక, ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చిందని వారు నిలదీస్తున్నారు. 1200 మంది అమరవీరుల చితిమంటల సాక్షిగా ఏర్పడిన రాష్ట్రాన్ని కించపరిచే హక్కు కర్ణాటకకు చెందిన ఎంపీకి ఎవరిచ్చారని హరీశ్‌రావు చేసిన ధ్వజం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అసలు బీజేపీకి తెలంగాణ ఏర్పాటుపై చిత్తశుద్ధి ఉందా? లేక లోలోపల ఇంకా విషాన్ని దాచుకుంటున్నారా? అన్న అనుమానాలను ఈ వ్యాఖ్యలు బలపరుస్తున్నాయి. కేవలం ఓట్ల రాజకీయాల కోసం ఒక ప్రాంతపు సెంటిమెంట్‌ను అంతర్జాతీయ సరిహద్దు వివాదాలతో పోల్చడం బీజేపీ దిగజారుడుతనానికి పరాకాష్ట అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు, అధికార కాంగ్రెస్ పార్టీ సైతం బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై రణరంగం సృష్టించింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అత్యంత ఘాటు పదజాలంతో తేజస్వీ సూర్యను హెచ్చరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఖబడ్దార్’ అంటూ ఆయన చేసిన హెచ్చరిక తెలంగాణ సగటు మనిషి ఆగ్రహానికి ప్రతిరూపంగా నిలిచింది. సోనియా గాంధీ ఇచ్చిన మాట కోసం, రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి తెలంగాణ ఇస్తే.. దానిని అపహాస్యం చేయడం అంటే ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఖూనీ చేయడమేనని మంత్రి మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ ఎంపీల మౌనాన్ని ఆయన ప్రశ్నిస్తూ.. ‘మీ గడ్డను అవమానిస్తుంటే ఢిల్లీ పెద్దల దగ్గర మోకరిల్లుతారా?’ అని సంధించిన బాణాలు కమలనాథులను ఆత్మరక్షణలో పడేశాయి. రాష్ట్ర అస్తిత్వంపై దాడి జరుగుతున్నప్పుడు పార్టీలకతీతంగా స్పందించాల్సిన బాధ్యతను బీజేపీ నేతలు విస్మరించడం వారి నైతిక వైఫల్యమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
ముఖ్యంగా తేజస్వీ సూర్య ఈ వ్యాఖ్యలను డీలిమిటేషన్ చర్చలో భాగంగా చేయడం వెనుక ఒక పక్కా వ్యూహం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల గళాన్ని నొక్కేయడానికి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విభజనను ఒక అపరాధంగా చిత్రించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. తెలంగాణ ఏర్పాటు సాఫీగా జరగలేదని ప్రధాని మోదీ గతంలో అన్న మాటలకు, ఇప్పుడు తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలకు పొంతన కుదురుతోంది. ఒకవైపు దక్షిణాదికి అన్యాయం జరగదని అమిత్ షా భరోసా ఇస్తుంటే, మరోవైపు అదే పార్టీ ఎంపీ ఇక్కడి ఆత్మగౌరవాన్ని కాలరాసేలా మాట్లాడటం ఆ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎండగడుతోంది. తెలంగాణ గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డను ‘దేశ విభజన’ బాధితుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం అంటే చరిత్రను వక్రీకరించడమేనని మేధావులు మండిపడుతున్నారు.
ఉద్యమకారులు , విద్యార్థి సంఘాలు సైతం ఈ వ్యవహారంపై ఉగ్రరూపం దాల్చాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం సాక్షిగా గర్జించిన గొంతుకలు.. బీజేపీ ఎంపీకి తెలంగాణ చరిత్రను బోధించాల్సిన సమయం వచ్చిందని హెచ్చరిస్తున్నాయి. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగిన పోరాటాన్ని సామాజిక విచ్ఛిన్నంగా అభివర్ణించడం వారి అహంకారానికి నిదర్శనమని ఉద్యమనేతలు ధ్వజమెత్తుతున్నారు. తేజస్వీ సూర్య వ్యాఖ్యలు కేవలం ఒక వ్యక్తి మాటలు కాదని, దక్షిణాదిపై ఉత్తరాది భావజాలం చేస్తున్న దాడిగా వారు పరిగణిస్తున్నారు. తక్షణమే బీజేపీ అగ్రనాయకత్వం ఈ విషయంలో క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో తెలంగాణ గడ్డపై ఆ పార్టీకి పుట్టగతులు ఉండవని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద, పార్లమెంట్ సాక్షిగా రేగిన ఈ ‘చిల్లర’ వ్యాఖ్యల చిచ్చు.. తెలంగాణలో రాజకీయ పునరేకీకరణకు, అస్తిత్వ పోరాటానికి మరోసారి వేదికగా మారుతోంది. ఈ సెన్సేషనల్ ఇష్యూ రాబోయే ఎన్నికల్లో బీజేపీకి పెను శాపంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Latest