* న్యూజిలాండ్-కెనడా మ్యాచ్‌పై ఐసీసీ విచారణ.
చెన్నై,మహా.
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా చెన్నైలోని చేపాక్ మైదానంలో న్యూజిలాండ్, కెనడా జట్ల మధ్య ఫిబ్రవరి 17న జరిగిన మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు రావడం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ మ్యాచ్‌లో స్పాట్ ఫిక్సింగ్ జరిగినట్లు బలమైన ఆధారాలు లభించడంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కి చెందిన యాంటీ కరప్షన్ యూనిట్ అధికారికంగా దర్యాప్తు ప్రారంభించింది. కెనడా క్రికెట్ బోర్డులో సాగుతున్న అవినీతి, అంతర్గత కుమ్ములాటలపై ‘ది ఫిఫ్త్ ఎస్టేట్’ అనే సంస్థ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రధానంగా కెనడా కెప్టెన్ దిల్ప్రీత్ బజ్వా వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌పై ఐసీసీ అధికారులు దృష్టి సారించారు. తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా 173 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ, లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ బ్యాటర్లకు కెప్టెన్ బజ్వా అనూహ్య రీతిలో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఆ ఓవర్‌లో నో బాల్, వైడ్‌తో పాటు ఏకంగా 15 పరుగులు రావడంతో కివీస్ జట్టు సులువుగా విజయం వైపు పయనించింది. టోర్నమెంట్‌కు కొద్దిరోజుల ముందే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన బజ్వా, ఉద్దేశపూర్వకంగానే ఈ అక్రమాలకు పాల్పడినట్లు కెనడా మీడియా తన డాక్యుమెంటరీలో ఆరోపించింది.
ఈ వ్యవహారంలో కేవలం ఆటగాళ్లే కాకుండా, కెనడా క్రికెట్ బోర్డులోని కొందరు ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ కోచ్ ఖుర్రం చోహన్ కు సంబంధించిన ఒక ఆడియో క్లిప్ కూడా ఇప్పుడు దర్యాప్తులో కీలకంగా మారింది. కొందరు బోర్డు సభ్యులు తమకు అనుకూలమైన ఆటగాళ్లను జట్టులోకి ఎంపిక చేయాలని ఒత్తిడి తెచ్చారని, దీని వెనుక బెట్టింగ్ మాఫియా హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఐసీసీ ఇంటెగ్రిటీ యూనిట్ అధికారులు ఇప్పటికే చెన్నైలోని హోటల్ సిబ్బందిని, స్టేడియం అధికారులను విచారించినట్లు సమాచారం. ఒకవేళ ఈ ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత ఆటగాళ్లపై జీవితకాల నిషేధంతో పాటు కెనడా క్రికెట్ బోర్డుపై కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. క్రీడా స్ఫూర్తిని దెబ్బతీసే ఇటువంటి చర్యలను సహించేది లేదని, విచారణ నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయాలు ఉంటాయని ఐసీసీ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు.






