హైదరాబాద్, మహా.
మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో వీగిపోవడానికి భారతీయ జనతా పార్టీ అనుసరించిన అనాలోచిత విధానాలు, రాజకీయ కుతంత్రాలే కారణమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలోని మహిళా లోకానికి దక్కాల్సిన చారిత్రక అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం తన స్వార్థ రాజకీయాల కోసం బలితీసుకుందని ఆయన ఆరోపించారు. మహిళా సాధికారతపై బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని నేటి పరిణామాలతో తేటతెల్లమైందని, కేవలం ఎన్నికల లబ్ధి కోసమే ఈ అంశాన్ని వాడుకుని మహిళలను వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు.
మహిళా బిల్లును ఉద్దేశపూర్వకంగానే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంతో ముడిపెట్టడం వల్ల ఈ దుస్థితి దాపురించిందని కేటీఆర్ విమర్శించారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలతోనే రిజర్వేషన్లను అమలు చేసే అవకాశం ఉన్నప్పటికీ, కేంద్రం కావాలనే చిక్కుముళ్లు తెచ్చిపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల రిజర్వేషన్ల భుజాల మీద తుపాకీ పెట్టి దక్షిణాది రాష్ట్రాల గొంతు కోయాలని బీజేపీ చూస్తోందని, డీలిమిటేషన్ వల్ల దక్షిణ భారతదేశానికి పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంలో దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా మొండిగా ముందుకు పోవడం వల్లే ఈ కీలక బిల్లు విఫలమైందని ఆయన విశ్లేషించారు.
బీఆర్ఎస్ సహా దేశంలోని మెజారిటీ రాజకీయ పార్టీలు మహిళా రిజర్వేషన్లకు బేషరతుగా మద్దతు పలికిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. ఇప్పటికైనా కేంద్రం తన నిజాయితీని నిరూపించుకోవాలంటే, డీలిమిటేషన్ నిబంధన లేకుండా కేవలం మహిళా రిజర్వేషన్ల కోసమే ఒక కొత్త బిల్లును ప్రవేశపెట్టి తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ అనేది అత్యంత సంక్లిష్టమైన అంశమని, దీనిపై అన్ని రాష్ట్రాలతో విస్తృతమైన చర్చలు జరపాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. లోక్‌సభలో జరిగిన పరిణామాలను బట్టి బీజేపీ ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకోవాలని సూచించారు.
రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనూ కేంద్రం వివక్ష చూపుతోందని కేటీఆర్ ఈ సందర్భంగా ఆరోపించారు. తెలంగాణ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల పెంపు అనేది తమ హక్కు అని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్, అస్సాం వంటి రాష్ట్రాల్లో దేశవ్యాప్త డీలిమిటేషన్ తో సంబంధం లేకుండా సీట్ల పెంపు చేపట్టిన కేంద్రం, తెలంగాణ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని ప్రశ్నించారు. 2028 లోపు తెలంగాణ అసెంబ్లీ సీట్లను పెంచేలా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రత్యేక బిల్లు తీసుకురావాలని కేటీఆర్ గట్టిగా డిమాండ్ చేశారు.







