Mahaa Daily Exclusive

  తండ్రి ఎడబాటు తట్టుకోలేక బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య…

Share

* నాన్న వద్దకే వెళ్తున్నానంటూ సూసైడ్‌ నోట్‌.
హైదరాబాద్, మహా.
నగర శివారులోని పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక మనోవేదనకు గురైన ఓ బీటెక్‌ విద్యార్థిని హాస్టల్‌ గదిలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. ఏలూరు జిల్లా చిత్రాయి గ్రామానికి చెందిన జ్ఞానశ్రీ (21), దుండిగల్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది. ప్రాణంగా ప్రేమించే తండ్రి చెన్నకేశవరెడ్డి గత నెల మార్చి 31న అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె తీవ్ర విచారంలో మునిగిపోయింది. నాన్న లేని లోటును భరించలేకపోయిన సదరు విద్యార్థిని, శుక్రవారం హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని అఘాయిత్యానికి పాల్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గదిని సోదా చేయగా పోలీసులకు ఒక సూసైడ్‌ నోట్‌ లభ్యమైంది. తండ్రి మరణం తర్వాత తాను ఒంటరినయ్యానని, ఆయన లేని లోకంలో జీవించలేక నాన్న వద్దకే వెళ్లిపోతున్నానని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఉన్నత చదువులు చదివి ప్రయోజకురాలు అవుతుందనుకున్న కూతురు, తండ్రి మరణంతో అర్థాంతరంగా తనువు చాలించడంతో ఆమె స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మెరుగైన భవిష్యత్తు ఉన్న విద్యార్థిని ఇలా తనువు చాలించడం తోటి విద్యార్థులను కలచివేసింది.