* అప్రూవర్‌గా మారుతానన్న నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్.
ఢిల్లీ, మహా
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ.215 కోట్ల మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ప్రభుత్వ సాక్షిగా (అప్రూవర్‌గా) మారేందుకు సిద్ధమని ప్రకటించారు. ఆర్థిక నేరగాడు సుకేష్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే జాక్వెలిన్‌ను నిందితురాలిగా చేర్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తానూ అప్రూవర్‌గా మారుతానని, కేసు విచారణకు సహకరిస్తానని ఆమె ఢిల్లీ హైకోర్టును అభ్యర్థించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సుకేష్ చంద్రశేఖర్ జైలు నుంచే సాగించిన అక్రమ దందాల ద్వారా సంపాదించిన సొమ్మును జాక్వెలిన్‌కు భారీగా మళ్లించినట్లు ఈడీ తన అభియోగపత్రంలో పేర్కొంది. మనీ లాండరింగ్ ద్వారా వచ్చిన నిధులతో సుకేష్ ఆమెకు దాదాపు రూ.10 కోట్ల విలువైన అత్యంత ఖరీదైన బహుమతులను అందజేసినట్లు విచారణలో తేలింది. వీటిలో వజ్రాల చెవిపోగులు, బ్రాస్లెట్లు, విదేశీ బ్రాండ్లకు చెందిన హ్యాండ్‌బ్యాగులు, జిమ్ సూట్లతో పాటు ఒక మినీ కూపర్ కారు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సొమ్ము అక్రమ మార్గాల్లో వచ్చిందని తెలిసి కూడా జాక్వెలిన్ ఆ బహుమతులను స్వీకరించారని ఈడీ గట్టిగా వాదిస్తోంది.
ఈ కేసు నుంచి బయటపడేందుకు జాక్వెలిన్ గత కొంతకాలంగా న్యాయపోరాటం చేస్తున్నారు. తనపై నమోదైన ఈడీ కేసును కొట్టివేయాలని కోరుతూ తొలుత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ చుక్కెదురు కావడంతో ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా, ఈ కేసు విచారణలో ఉన్నప్పుడే తాను అప్రూవర్‌గా మారతానని కోర్టుకు విన్నవించుకున్నారు. అయితే, న్యాయస్థానం ఈ విన్నపంపై స్పందిస్తూ.. నిబంధనల ప్రకారం ఒక నిందితుడు అప్రూవర్‌గా మారాలంటే ముందుగా దర్యాప్తు సంస్థ అయిన ఈడీని సంప్రదించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, ఆమె అభ్యర్థనను ఈడీ అంగీకరిస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆమె అప్రూవర్‌గా మారితే, సుకేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన మరిన్ని చీకటి కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని దౌత్య , న్యాయ వర్గాలు భావిస్తున్నాయి.







