* ఏకంగా రూ.100 కోట్లకు పరువు నష్టం దావా.
* హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఘాటు వ్యాఖ్యలు.
* వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని హెచ్చరిక.
* టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి.
తిరుపతి, మహా.
ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిని, పవిత్ర రామాయణాన్ని ఉద్దేశపూర్వకంగా కించపరుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ వ్యవహారంలో ప్రకాష్ రాజ్‌పై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి సభ్యుడు జి. భానుప్రకాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని పేర్కొంటూ, ఏకంగా 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తూ తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు పంపించారు.
కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌తో పాటు పలు బహిరంగ వేదికలు, సోషల్ మీడియా వేదికలపై ప్రకాష్ రాజ్ హిందూ మత విశ్వాసాలను కించపరిచేలా మాట్లాడారని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన శ్రీరాముడు, లక్ష్మణుడు.. దక్షిణ భారతదేశమైన ‘లంక’పై దండెత్తారని ప్రకాష్ రాజ్ అవాస్తవాలను ప్రచారం చేశారని ఆరోపించారు. పవిత్ర రామాయణాన్ని వక్రీకరిస్తూ, ఉత్తరాది వారిని ఆక్రమణదారులుగా, దక్షిణాదిని బాధితులుగా చిత్రీకరిస్తూ దేశంలో ‘ఆర్య-ద్రవిడ’ విభేదాలను రెచ్చగొట్టేలా ఆయన మాట్లాడటం దారుణమని భానుప్రకాష్ రెడ్డి ఆక్షేపించారు. ఇది జాతి సమగ్రతకు ముప్పు కలిగించే ప్రమాదకరమైన చర్య అని, కచ్చితంగా హిందూ భక్తుల విశ్వాసాలను గాయపరచాలనే దురుద్దేశంతోనే ఆయన ఈ విధంగా వ్యవహరిస్తున్నారని నోటీసులో స్పష్టం చేశారు. వేరే మతాన్ని (క్రైస్తవం) పాటిస్తున్న ప్రకాష్ రాజ్‌కు, ఇతర మతాల పవిత్ర గ్రంథాలను కించపరిచే హక్కు లేదని గుర్తుచేశారు.
ఈ అభ్యంతరకర మరియు విద్వేషపూరిత వ్యాఖ్యల ద్వారా ప్రకాష్ రాజ్ భారతీయ న్యాయ సంహిత (BNS) 2023 లోని సెక్షన్ 299, 196, 356 తదితర చట్టాల కింద నేరాలకు పాల్పడ్డారని భానుప్రకాష్ రెడ్డి తరపు న్యాయవాది కె. అజయ్ కుమార్ పంపిన నోటీసుల్లో పొందుపరిచారు. ఈ వ్యాఖ్యల పట్ల ఎంతో మంది శ్రీరామ భక్తులు తీవ్ర మనోవేదనకు గురయ్యారని, తనకు కూడా పలువురి నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని భానుప్రకాష్ రెడ్డి తెలిపారు.
ఈ లీగల్ నోటీసులు అందిన ఏడు రోజుల్లోగా ప్రకాష్ రాజ్ తన వ్యాఖ్యలపై బేషరతుగా, బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తాను చేసిన వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధమని, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని అంగీకరిస్తూ ప్రముఖ దినపత్రికలు, తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా రాతపూర్వక క్షమాపణలు తెలియజేయాలని స్పష్టం చేశారు. అలాగే భవిష్యత్తులో రామాయణాన్ని, హిందూ దేవుళ్లను కించపరిచేలా వీడియోలు, కామెంట్లు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఒకవేళ నిర్దేశించిన గడువులోగా స్పందించి క్షమాపణలు చెప్పకపోతే, ప్రకాష్ రాజ్‌పై తగిన సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని, హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు గాను రూ. 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావాను న్యాయస్థానంలో ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ నోటీసుల్లో ఘాటుగా హెచ్చరించారు.








