వేసవి తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు.
*బీఆర్ఎస్ అక్రమాల చిట్టా సిద్ధం.
*భూ-భారతితో ధరణి సమస్యలకు చెక్.
* త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ
* భూముల విలువల పెంపుకు ప్రతిపాదన.
* మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో మండల పరిషత్, జిల్లా పరిషత్ (ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికలు వేసవి కాలం ముగిసిన తర్వాతే జరిగే అవకాశం ఉందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, అలాగే రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువలను పెంచేందుకు కసరత్తు జరుగుతోందని ఆయన వెల్లడించారు. శనివారం మీడియాతో ఇష్టాగోష్టిగా (చిట్ చాట్) మాట్లాడిన మంత్రి.. రెవెన్యూ సంస్కరణలు, స్థానిక ఎన్నికలు, రాజకీయపరమైన అంశాలపై కీలక అప్‌డేట్స్ అందించారు.
**మంత్రివర్గ విస్తరణ.. నామినేటెడ్ పోస్టుల భర్తీ**
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో మంత్రి పొంగులేటి స్పష్టత ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితులు, రానున్న ఎండల తీవ్రత దృష్ట్యా వేసవి తర్వాతే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. ఇక రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన కేబినెట్ విస్తరణపై స్పందిస్తూ.. ఇది విడతల వారీగా జరుగుతుందని పేర్కొన్నారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ప్రస్తుత మంత్రుల శాఖల్లోనూ మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందన్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేయలేదు. ఏ శాఖ కూడా ఎవరికీ శాశ్వతం కాదని, అయితే కీలక శాఖలపై ఆశలు పెట్టుకోవడం రాజకీయాల్లో సహజమేనని ఆయన వ్యాఖ్యానించారు. దీనితో పాటు పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ సైతం త్వరలోనే చేపడతామని మంత్రి వెల్లడించారు.
**మ్యాప్‌తో రిజిస్ట్రేషన్లు.. భూ-భారతితో ధరణి సమస్యలకు చెక్**
తెలంగాణలో త్వరలోనే భూముల ప్రభుత్వ విలువలు పెరగనున్నాయని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ల్యాండ్ వాల్యూ పెంచలేదని, ప్రస్తుతం విలువల సవరణపై కసరత్తు జరుగుతోందని తెలిపారు. రెవెన్యూ శాఖలో సరికొత్త విధానాన్ని తీసుకురాబోతున్నామని, వివాదాస్పద ‘ధరణి’ పోర్టల్ సమస్యలన్నింటినీ నూతనంగా తీసుకువస్తున్న ‘భూ-భారతి’ వ్యవస్థతో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ నెల 20వ తేదీ నుంచి వినూత్నంగా మ్యాప్‌తో కూడిన భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో మొట్టమొదటి మ్యాప్ రిజిస్ట్రేషన్ పాలేరులో జరగనుందని ఆయన వెల్లడించారు. అసైన్డ్ భూములకు సంబంధించి అత్యధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిలో ప్రధానంగా నాలుగు రకాల సమస్యలను వేగంగా పరిష్కరించేలా అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని మంత్రి వివరించారు.
**బీఆర్ఎస్ అక్రమాల చిట్టా సిద్ధం.. సరైన సమయంలో బయటపెడతాం**
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై మంత్రి పొంగులేటి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అక్రమ పనుల జాబితాను ప్రస్తుతం సిద్ధం చేస్తున్నామని, సరైన సమయంలో వాటన్నింటినీ ప్రజల ముందు ఉంచుతామని హెచ్చరించారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష సభ్యులు తనపై మూకుమ్మడి దాడికి యత్నించినప్పుడు, తోటి మంత్రులు తనకు అండగా నిలిచారని గుర్తుచేసుకున్నారు. ప్రతిపక్షాల ట్రాప్‌లో తాను పడనని, వారు ఎంతగా విమర్శించినా అత్యంత ఓపికగా భరించి సముచితమైన రీతిలో సమాధానం ఇచ్చానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.







