Mahaa Daily Exclusive

  రేవంత్ రెడ్డిది బీజేపీతో కుదుర్చుకున్న ‘క్రాస్ బ్రీడ్’ బంధం: మాజీ మంత్రి హరీశ్ రావు ఘాటు విమర్శలు!

Share

ఉత్తర తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారబోతోంది.
* రేవంత్ రెడ్డిది బీజేపీ పెద్దలతో కుదుర్చుకున్న క్రాస్ బ్రీడ్ బంధం.
* మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు.

జగిత్యాల, మహా.

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి వేదిక సిద్ధమవుతోంది. రాజకీయ విలువలకు మారుపేరుగా నిలిచే కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారబోతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు స్పష్టం చేశారు. జగిత్యాలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి పర్యటించిన ఆయన, ఈ నెల 20న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో నిర్వహించనున్న జీవన్ రెడ్డి చేరిక సభ ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై నిప్పులు చెరిగారు. జీవన్ రెడ్డి వంటి అనుభవజ్ఞుడైన నాయకుడు బీఆర్ఎస్‌లో చేరడం ఒక్క కరీంనగర్ జిల్లాకే కాకుండా, యావత్ ఉత్తర తెలంగాణలో పార్టీకి కొండంత బలాన్ని ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల మనోగతం స్పష్టంగా ఉందన్న ఆయన, “రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి” అన్న నినాదం ఇవాళ పల్లెపల్లెనా మారుమోగుతోందని, జీవన్ రెడ్డి నిర్ణయమే దానికి సజీవ సాక్ష్యమని పేర్కొన్నారు.
పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవానికి జరిగిన అవమానంపై హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చడం ద్వారా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెలను గాయపరిచారని మండిపడ్డారు. దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన ఆర్టికల్ 3 ప్రకారం, ఉభయ సభల్లో బిల్లులు ఆమోదం పొంది, రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రజాస్వామిక పద్ధతిలో ఏర్పడిన తెలంగాణను కించపరచడం బీజేపీ అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. ఒక ఎంపీ ఇంత బాధ్యతారహితంగా మాట్లాడుతుంటే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ వ్యాఖ్యలను ఖండించాల్సింది పోయి, వాటిని సమర్థించేలా వ్యవహరించడం అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలియని వారు ఇక్కడి ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారని, తక్షణమే బీజేపీ నాయకత్వం రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలంగాణ సమాజం ఈ అవమానాన్ని ఎన్నటికీ మర్చిపోదని హెచ్చరించారు.
లోక్‌సభలో ప్రస్తుతం తెలంగాణ గొంతుక వినిపించే నాథుడే కరువయ్యారని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీల నుంచి 16 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, రాష్ట్ర ఆత్మగౌరవం దెబ్బతింటుంటే వారంతా మౌన ముద్రలో ఉండటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. అదే పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు ఉండి ఉంటే, తేజస్వి సూర్యకు తెలంగాణ బిడ్డల సత్తా ఏంటో తెలిసేలా మూతి పగిలే సమాధానం చెప్పేవారమని వ్యాఖ్యానించారు. రాజ్యసభలో కేవలం ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీలు ఉన్నప్పటికీ, కేంద్ర జలవనరుల మంత్రి తప్పుడు గణాంకాలు చెప్పినప్పుడు గర్జించి, స్పీకర్‌ను కలిసి ఆధారాలతో సహా రికార్డులను సవరించిన ఘనత తమ పార్టీదేనని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తున్న ఎంపీల తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని ఎండగడుతూ, ఆయన ‘బడే భాయ్’ మోదీకి భయపడుతున్నారని హరీశ్ రావు విమర్శించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీపై పోరాటం చేస్తుంటే, రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీలో బీజేపీ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ నివాసానికి వెళ్లి విందులు ఆరగించడం వెనుక ఉన్న మర్మమేమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చెబుతున్న ‘హైబ్రిడ్ మోడల్’ అసలు స్వరూపం ఇవాళ బయటపడిందని, అది నిజానికి బీజేపీతో కుదుర్చుకున్న ‘క్రాస్ బ్రీడ్’ బంధమని ఘాటుగా విమర్శించారు. ఈ వింత సిద్ధాంతం రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి అర్థమవుతుందో లేదో వారే చెప్పాలన్నారు. రాష్ట్రంలో పరిపాలనను గాలికి వదిలేసి, తన రాజకీయ ఉనికి కోసం ఢిల్లీ పెద్దల చుట్టూ తిరుగుతూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని దుయ్యబట్టారు.
మహిళా రిజర్వేషన్ల అంశంలో కూడా కాంగ్రెస్, బీజేపీలు కలిసి నాటకమాడాయని హరీశ్ రావు ఆరోపించారు. మహిళా బిల్లును డీలిమిటేషన్ ప్రక్రియతో ముడిపెట్టడమే వారి చిత్తశుద్ధి లేమికి నిదర్శనమని, కేవలం ఓట్ల కోసమే మహిళలను మోసం చేశారని విమర్శించారు. మహిళల పట్ల బీఆర్ఎస్ పార్టీకి ఉన్న గౌరవం ఎనలేనిదని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే అసెంబ్లీలో మహిళా రిజర్వేషన్ల కోసం ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపామని గుర్తు చేశారు. తెలంగాణను అవమానించిన వారిని, రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టిన వారిని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ క్షమించరని, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ రాష్ట్ర హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేస్తుందని హరీశ్ రావు పునరుద్ఘాటించారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest