భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.
* తొమ్మిది మందికి కొత్త పోస్టింగ్‌లు.
*ఏఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి.
• వరంగల్, భద్రాచలం పోలీసు అధికారులకు కీలక బాధ్యతలు.
*ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళన జరిగింది. పరిపాలనా సౌలభ్యం, శాంతిభద్రతల పర్యవేక్షణను మరింత పటిష్టం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం తొమ్మిది మంది యువ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పరిపాలన శాఖ (స్పెషల్-బి) తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఈ మేరకు జీవో ఆర్టీ నంబర్ 491ని విడుదల చేశారు. ప్రధానంగా వివిధ జిల్లాల్లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) హోదాలో విధులు నిర్వర్తిస్తున్న 2022, 2023 బ్యాచ్‌లకు చెందిన యువ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ అదనపు ఎస్పీలుగా (అడ్మిన్) అత్యంత కీలకమైన బాధ్యతలు అప్పగించడం ఈ బదిలీల్లో ప్రధానాంశంగా నిలిచింది. డీజీపీ కార్యాలయం నుంచి అందిన ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. బదిలీ అయిన అధికారులందరూ తక్షణమే తమ పాత స్థానాల నుంచి రిలీవ్ అయి, కొత్త బాధ్యతలను స్వీకరించాలని సీఎస్ ఆ ఉత్తర్వుల్లో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
**పలు జిల్లాల పోలీసు యంత్రాంగంలో మార్పులు**
పాలనాపరమైన అవసరాల దృష్ట్యా చేపట్టిన ఈ బదిలీల ప్రక్రియలో రాష్ట్రంలోని పలు కీలక జిల్లాల పోలీసు అధికారులకు స్థానచలనం ఏర్పడింది. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం.. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏఎస్పీగా ఉన్న 2022 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఎస్. చిత్తరంజన్‌ను అదే జిల్లాలో ఖాళీగా ఉన్న అదనపు ఎస్పీ (అడ్మిన్) పోస్టుకు బదిలీ చేశారు. అలాగే కామారెడ్డి ఏఎస్పీగా సేవలు అందిస్తున్న బొక్క చైతన్య రెడ్డిని సంగారెడ్డి అదనపు ఎస్పీ (అడ్మిన్)గా నియమించారు. ప్రస్తుతం సంగారెడ్డిలో ఉన్న సి.హెచ్. రఘునందన్ రావును బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో చైతన్య రెడ్డికి అవకాశం కల్పించారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో అదనపు ఎస్పీగా ఉన్న మహిళా ఐపీఎస్ అధికారిణి పి. మౌనికకు అదే జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్)గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు. భైంసా అదనపు ఎస్పీగా, ఎస్డీపీఓగా ఉన్న రాజేష్ మీనాను వనపర్తి జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్)గా బదిలీ చేశారు. నిర్మల్ జిల్లా ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న పాతిపాక సాయికిరణ్‌ను భైంసా ఏఎస్పీ/ఎస్డీపీఓగా నియమించారు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏఎస్పీగా ఉన్న రుత్విక్ సాయి కొట్టేను ఉట్నూరు ఏఎస్పీ/ఎస్డీపీఓగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
**ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల అధికారులకు కీలక స్థానాలు**
ఉత్తర తెలంగాణతో పాటు ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలో పనిచేస్తున్న పలువురు చురుకైన యువ ఐపీఎస్ అధికారులకు ఈ బదిలీల్లో ప్రాధాన్యత దక్కింది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని జనగామ ఏఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న పందేరే చేతన్ నితిన్‌ను జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్)గా బదిలీ చేశారు. అలాగే వరంగల్ ఏఎస్పీగా ఉన్న మరో యువ ఐపీఎస్ అధికారి నగ్రాలె శుభమ్ ప్రకాష్‌ను నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని అత్యంత ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏఎస్పీగా పనిచేస్తున్న విక్రాంత్ కుమార్ సింగ్‌కు మెదక్ జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్)గా బాధ్యతలు అప్పగించారు. అక్కడ పనిచేస్తున్న ఎస్. మహేందర్‌ను బదిలీ చేస్తూ ఆయన స్థానంలో విక్రాంత్ కుమార్ సింగ్‌ను నియమించారు.
ప్రజలతో మమేకమవుతూ, శాంతిభద్రతల పరిరక్షణలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఈ యువ ఐపీఎస్‌లకు అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగించడం ద్వారా ఆయా జిల్లాల పోలీస్ శాఖలో మరింత జవాబుదారీతనం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. నేరాల నియంత్రణ, , పోలీసు యంత్రాంగాన్ని మరింత పారదర్శకంగా ముందుకు నడిపించే వ్యూహంలో భాగంగానే ఈ మార్పులు చేపట్టినట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్న ఈ యువ అధికారులు క్షేత్రస్థాయిలో పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేస్తారని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.







