*అద్భుత జ్ఞాపకశక్తి.. 1,800 వచనాలు ఇట్టే ఒప్పజెబుతున్న 15 ఏళ్ల బాలిక!
*వచనాల ఛాంపియన్గా లావణ్య అరుదైన రికార్డులు
*గంటల వ్యవధిలోనే వందలాది పద్యాల పఠనం
*హైదరాబాద్, మహా*
పుస్తకం చూడకుండా ఓ పది పద్యాలు లేదా పాఠాలు అప్పజెప్పమంటేనే తడబడతాం. అలాంటిది ఏకంగా వెయ్యికి పైగా ఆధ్యాత్మిక వచనాలను అవలీలగా పఠిస్తూ అందరినీ విస్మయానికి గురిచేస్తోంది కర్ణాటకకు చెందిన 15 ఏళ్ల లావణ్య. అసాధారణ జ్ఞాపకశక్తితో సుమారు 1,800కు పైగా వచనాలను (కన్నడ ఆధ్యాత్మిక పద్యాలు) అనర్గళంగా కంఠస్థం చేస్తూ ‘వచనాల ఛాంపియన్’గా ప్రఖ్యాతి గాంచింది. చిన్న వయసులోనే ఎన్నో వేదికలపై తన ప్రతిభను చాటుతూ పలు పురస్కారాలను సైతం సొంతం చేసుకుంది.
**ఆరో తరగతిలోనే ఆధ్యాత్మికత వైపు అడుగులు**
బెళగావి జిల్లా హరే బాగేవాడి గ్రామానికి చెందిన మంజునాథ్, గిరిజ దంపతుల కుమార్తె లావణ్య ప్రస్తుతం 9వ తరగతి చదువుతోంది. బైల్హొంగల్ తాలూకా సానికొప్పలోని తన మేనమామ ఇంట్లో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగిస్తోంది. ఆరో తరగతి వేసవి సెలవుల్లో నాగనూరు రుద్రాక్షి మఠంలో జరిగిన ‘శరణ సంస్కార శిబిరం’ ఆమె జీవితాన్ని మార్చేసింది. అక్కడే ‘ఇష్టలింగ దీక్ష’ స్వీకరించిన లావణ్య.. వచనాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయడం మొదలుపెట్టింది. బసవన్న తదితర శరణుల బోధనలకు ఆకర్షితురాలై లింగాయత్ ఆధ్యాత్మిక ఆచరణల్లో పూర్తిగా మమేకమైంది.
**రికార్డుల మోత.. ప్రశంసల వర్షం**
లావణ్య ప్రస్థానం 2022లో మండల స్థాయి పోటీలతో ప్రారంభమైంది. అప్పట్లో అరగంటలో 81 వచనాలు పఠించిన ఆమె.. 2023 మే నెలలో బెళగావిలో జరిగిన జిల్లా స్థాయి పోటీలో గంట వ్యవధిలో 320 వచనాలు అప్పజెప్పి ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత చిత్రదుర్గలో 500, బసవకల్యాణలో ఐదు గంటల్లో 770, 2024లో నెలమంగలలో నాలుగు గంటల్లో 550 వచనాలు పఠించి సత్తా చాటింది. 2025 ఏప్రిల్లో నెలమంగలలో జరిగిన అంతర్రాష్ట్ర పోటీల్లో కేవలం మూడు గంటల్లో ఏకంగా 1,051 వచనాలు పఠించి లక్ష రూపాయల నగదు బహుమతి గెలుచుకోవడం విశేషం. ఆ తర్వాత కూడా సనేహళ్లిలో రెండు గంటల్లో 500 వచనాలు, 2026 జనవరిలో హవేరిలో 102, ఇటీవలే 2026 ఫిబ్రవరి 16న జోడట్టిలో 390 వచనాలు పఠించి తన ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తోంది.
**సాహిత్య సమ్మేళనానికి జూనియర్ అధ్యక్షురాలిగా..**
లావణ్య కంఠస్థం చేసిన వాటిలో బసవన్న వచనాలు సుమారు 900 వరకు ఉండగా.. అల్లమ ప్రభు, సిద్ధరామేశ్వర, అక్క మహాదేవి, జెడర దాసిమయ్య, అంబిగర చౌడయ్యల వచనాలు తలా వంద వరకు ఉన్నాయి. ఇతర శరణుల వచనాలు మరో 300 వరకు నేర్చుకుంది. ఆమె అపార ప్రతిభకు గుర్తింపుగా 2025 జూలైలో బెళగావిలో జరిగిన తొలి ‘పిల్లల కన్నడ సాహిత్య సమ్మేళనాని’కి జూనియర్ అధ్యక్షురాలిగా వ్యవహరించే అరుదైన అవకాశం దక్కింది. వచనాలు కేవలం కంఠస్థం చేయడానికే కాదని, విలువలతో కూడిన బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేందుకు అవి మార్గదర్శకంగా నిలుస్తాయని లావణ్య స్పష్టం చేస్తోంది.
**పదిలో వందశాతం మార్కులే లక్ష్యంగా..**
తన విజయాల వెనుక తల్లి, గురువులు మహంతేష్ తోరణగట్టి, తన అత్త మహాదేవి కిత్తూరుల ప్రోత్సాహం ఎంతో ఉందని లావణ్య చెబుతోంది. మఠంలో పొందిన ప్రాథమిక శిక్షణే తన విజయాలకు పునాది అని ఆమె పేర్కొంది. మొదట్లో రోజుకు 10 వచనాలు నేర్చుకున్న తను.. బ్రాహ్మ ముహూర్తంలో (తెల్లవారుజామున) నిద్రలేచి చదవడం అలవాటు చేసుకోవడం ద్వారా ఆ సంఖ్యను 50కి పెంచుకోగలిగింది. చదవడం కంటే రాసుకోవడం వల్ల మరింత బాగా గుర్తుంటాయని ఆమె భావిస్తోంది. అటు వచన పఠనంలోనే కాకుండా ఇటు చదువులోనూ చురుగ్గా ఉండే లావణ్య, రాబోయే పదో తరగతి పరీక్షల్లోనూ పూర్తి మార్కులు సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.








