*దక్షిణాదికి ద్రోహం చేసింది మీరే.
* మహిళలు చట్టసభల్లోకి వస్తే పునాదులు కదులుతాయనే బిల్లును అడ్డుకున్నారు.
*బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు కల్ల.
* ఆ పార్టీతో అధికారం పంచుకున్న చరిత్ర కాంగ్రెస్‌దే.
* కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజం.
హైదరాబాద్, మహా.
దేశంలో ‘ఒకటే దేశం – ఒకటే ఎన్నిక’ (జమిలి) విధానం వస్తే కచ్చితంగా బీజేపీనే ఘన విజయం సాధిస్తుందన్న భయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పట్టుకుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రజలు ఏమాత్రం విశ్వసించడం లేదని, ఆ విషయం గ్రహించే రాహుల్ స్థానాన్ని ఆక్రమించేందుకు రేవంత్ రెడ్డి అనవసరపు డ్రామాలకు తెరలేపుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తోందంటూ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చేస్తున్న గగ్గోలు వెనుక పెద్ద రాజకీయ కుట్రే దాగి ఉందని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, డీఎంకే సహా విపక్షాల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
**దక్షిణాదికి ద్రోహం చేసింది రేవంత్, స్టాలినే..**
పార్లమెంట్‌లో డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లును అడ్డుకోవడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు తీరని ద్రోహం చేసింది సీఎంలు రేవంత్ రెడ్డి, ఎంకే స్టాలినేనని బండి సంజయ్ దుయ్యబట్టారు. ఈ బిల్లు విషయంలో వారికి ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. కేవలం ఒక్క గంట సమయం ఇస్తే దాన్ని సవరించి, దక్షిణాదికి ఎలాంటి నష్టం కలగకుండా చూస్తానని సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయినా సరే ఆ మాటలను పెడచెవిన పెట్టి, కేవలం తమ రాజకీయ స్వార్థం కోసమే బిల్లును అడ్డుకుని దక్షిణాదికి అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
**కుటుంబ సభ్యులకు పదవులిస్తే మహిళలకు న్యాయం జరిగినట్లా?**
మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుని కాంగ్రెస్, డీఎంకే, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లు చారిత్రక తప్పిదానికి పాల్పడ్డాయని బండి సంజయ్ విమర్శించారు. ఈ కుటుంబ పార్టీల నాయకుల దృష్టిలో మహిళలు అంటే కేవలం సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, డింపుల్ యాదవ్, కనిమొళి మాత్రమేనని ఆయన ఎద్దేవా చేశారు. వాళ్లకు మాత్రమే చట్టసభల్లో అవకాశాలు, ఉన్నత పదవులు కట్టబెడితే చాలు.. దేశంలోని మహిళలందరికీ న్యాయం జరిగినట్లేనన్న భ్రమలో ఆయా పార్టీల నేతలు ఉన్నారని చురకలంటించారు. ఒకవేళ మహిళా బిల్లు ఆమోదం పొంది, సామాన్య మహిళలు సైతం పెద్ద ఎత్తున చట్టసభల్లోకి అడుగుపెడితే.. దశాబ్దాలుగా పాతుకుపోయిన తమ కుటుంబ పార్టీల పునాదులు ఎక్కడ కదిలిపోతాయోనన్న తీవ్ర భయంతోనే.. వారంతా ఒక్కటై మహిళా బిల్లుకు అడ్డుకట్ట వేశారని ఆరోపించారు.
**బీఆర్ఎస్‌తో అంటకాగింది మీరే..**
రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్‌తో పొత్తు అనేది కేవలం కల్లబొల్లి మాటలేనని స్పష్టం చేశారు. గతంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని, ఎన్నికల్లో కలిసి పోటీ చేసి, అధికారాన్ని పంచుకున్న ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉందన్న విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదని విమర్శించారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును నాడు పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీలే స్వయంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తే.. నాడు సంక్షోభంలో పడిన ఆ బిల్లుకు బీజేపీనే బేషరతుగా అండగా నిలిచి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిందని బండి సంజయ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.








