Mahaa Daily Exclusive

  కేసీఆర్ ‘స్టేట్స్ మన్’.. రేవంత్ ‘స్ట్రీట్ మన్’…

Share

*ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకెళ్లడం ఖాయం.
*కాళేశ్వరంపై అబద్ధాలు.. కాంగ్రెస్ పాలనంతా స్కాములే.
*సీఎం కుటిల రాజకీయాలపై మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం.

హైదరాబాద్, మహా.

రాష్ట్ర ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఒక ‘స్టేట్స్ మన్’ లాగా హుందాగా మాట్లాడితే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుర్చీ కోసం ఒక ‘స్ట్రీట్ మన్’ లాగా దిగజారి మాట్లాడారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తన్నీరు హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా, కేసీఆర్ సభకు పోటీగా అదే సమయానికి మైకు పట్టుకుని రేవంత్ రెడ్డి తన సంకుచిత బుద్ధిని బయటపెట్టుకున్నారని విమర్శించారు. కేసీఆర్ గారి ప్రసంగాన్ని లైవ్ లో 36 లక్షల మంది చూస్తే, రేవంత్ మాటలను కేవలం 4 లక్షల మంది మాత్రమే చూశారని, ప్రజల్లో కేసీఆర్ పై ఉన్న అభిమానానికి, రేవంత్ పడిపోయిన స్థాయికి ఈ లెక్కలే నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు. మంగళవారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై హరీశ్ రావు నిప్పులు చెరిగారు.
**భయంతోనే రైతు భరోసా విదిలింపు**
రెండు సీజన్లుగా రైతు భరోసా ఎగ్గొట్టిన ముఖ్యమంత్రి.. జగిత్యాల సభలో కేసీఆర్ గారు గర్జిస్తారని భయపడి డైవర్షన్ కోసం రాత్రికి రాత్రే ఒక ఎకరానికి కిస్తీ వేశారని హరీశ్ రావు విమర్శించారు. ఆయన గర్జించకపోతే ఆ డబ్బులు కూడా పడేవి కావన్నారు. ఇంకా 4000 కోట్ల బకాయిలు ఉన్నాయని, వచ్చే ఏడాది కరువు వస్తుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తే కానీ ప్రభుత్వానికి సోయి రాలేదని మండిపడ్డారు. కేసీఆర్ గారు తన పదేళ్ల పాలనలో ఎంతో హుందాగా రేవంత్ పేరు ఒక్కసారి కూడా ఎత్తకుండా మాట్లాడితే, రేవంత్ మాత్రం ఏడవడం, రాంకెలు వేయడం మినహా ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ చెప్పిన మాటలు విని తప్పులు సరిదిద్దుకుంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు కనీసం డిపాజిట్లు అయినా దక్కుతాయని, లేదంటే రేవంత్ జేజమ్మ దిగివచ్చినా రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు.
**ఢిల్లీ టూర్ పై చిల్లర డ్రామాలు**
తాము పార్టీ అధినేత ఆదేశాల మేరకే ఢిల్లీకి వెళ్లామని హరీశ్ రావు స్పష్టం చేశారు. కాళేశ్వరం కేసుతో పాటు, మే 6వ తేదీన హైకోర్టులో విచారణకు రాబోతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుల కోసం సీనియర్ న్యాయవాదులను సంప్రదించడానికి తాను, ఎంపీ రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్ కుమార్ బహిరంగంగానే శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లామని తెలిపారు. కానీ విషయం లేని రేవంత్ రెడ్డి తన మీడియా ద్వారా లీకులు ఇస్తూ చిల్లర డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఫామ్ పై గెలిచి తాను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నానని ఒక ఎమ్మెల్యే అనడం, దాన్ని స్పీకర్ ధ్రువీకరించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆయన ఆక్షేపించారు.
**ఓటుకు నోటు కేసులో పదవి ఊడటం ఖాయం**
పట్టపగలు బ్యాగులతో దొరికిపోయిన దొంగ రేవంత్ రెడ్డి అని, ఆయనకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని హరీశ్ రావు తేల్చిచెప్పారు. బుధవారం సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ ఉందని, ఆనాడు మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేసింది రేవంత్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం హోంమంత్రిగా ఆయనే ఉన్నారని, అంటే ముద్దాయి, ఫిర్యాదుదారుడు ఇద్దరూ ఒక్కరేనని విమర్శించారు. ప్రభుత్వం తరఫున నామమాత్రపు లాయర్లను పెట్టి, వ్యక్తిగతంగా తనను కాపాడుకోవడానికి మాత్రం ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ్ లూత్రా లాంటి ఖరీదైన లాయర్లను పెట్టుకున్నారని ఆరోపించారు. నాలుగున్నరేళ్ల నుంచి స్టేల మీద బతుకుతున్న రేవంత్ రెడ్డికి ఆ స్టే వెకేట్ అయితే ముఖ్యమంత్రి పదవి ఊడిపోవడం, జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు.
**కాళేశ్వరంపై మాట మార్చిన సీఎం**
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, లక్ష కోట్లు కొట్టుకుపోయాయని నిన్నటిదాకా దుష్ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి.. ఇవాళ మేడిగడ్డ రిపేరు చేసుకుని వాడుకుంటామని ఒప్పుకోవడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని హరీశ్ రావు దుయ్యబట్టారు. రెండు పిల్లర్లు కుంగితే ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయినట్లా అని ప్రశ్నించారు. ఏ తెలవని, బీ తెలవని రేవంత్ రెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టు తామే కట్టామని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితో వరద ఉంటే మిడ్ మానేరు నుంచి, మధ్యస్థంగా నీరుంటే ఎల్లంపల్లి నుంచి, కరువు వస్తే మేడిగడ్డ నుంచి నీటిని లిఫ్ట్ చేసుకునేలా కాళేశ్వరాన్ని డిజైన్ చేశారని వివరించారు. ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు గోదావరి నీళ్లను మోటార్లు లేకుండా ఎలా తీసుకువస్తారో రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు. లోయర్ మానేరు కాలువలు బాగుచేసి, 12 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చింది కేసీఆర్ ప్రభుత్వమేనని, తాను మంత్రిగా ఉన్నప్పుడే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి చేశామని, అప్పుడు రేవంత్ రెడ్డి తన వెనక నెక్కర్లు వేసుకుని తిరిగాడని, కావాలంటే వీడియోలు పంపిస్తానని సవాల్ విసిరారు.
**సకల జనులను దగా చేసిన కాంగ్రెస్**
మళ్లీ మేమే గెలుస్తామని ప్రచారం చేసుకుంటున్న రేవంత్ రెడ్డి.. ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతారని హరీశ్ రావు నిలదీశారు. రైతుబంధు, రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టినందుకా, తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు అప్పగించి, నిధులను ఢిల్లీకి, కుప్పానికి తరలిస్తున్నందుకా ప్రజలు ఓట్లు వేయాలా అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు, మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామని చెప్పి నిలువునా మోసం చేశారన్నారు. పథకాలు లేవు కానీ, రాష్ట్రాన్ని స్కాములతో నింపేశారని, సింగరేణిని దోచుకున్నారని మండిపడ్డారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టడం, ఖమ్మం వెలుగుమట్లలో వేల ఇళ్లు నేలమట్టం చేయడం, కలుషిత ఆహారంతో 200 మంది గురుకుల విద్యార్థులను పొట్టనపెట్టుకోవడం ఈ ప్రభుత్వ ఘనత అని ఎద్దేవా చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకుండా లక్షలాది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని, ఉద్యోగులను, ఆర్టీసీ కార్మికులను, అంగన్వాడీలను రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీల కోసం లగచర్ల రైతుల చేతులకు బేడీలు వేసి, కులవృత్తులను ధ్వంసం చేసిన కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. రేవంత్ ఎన్ని డ్రామాలు ఆడినా ముఖ్యమంత్రిగా ఆయనకు నూకలు చెల్లాయని స్పష్టం చేశారు.