Mahaa Daily Exclusive

  ఏసీబీ వలలో నారాయణపేట ఆర్డీఓ…

Share

*బర్త్ సర్టిఫికెట్ల కోసం రూ.25 వేలు డిమాండ్.
*లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టివేత.
*నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్న అధికారులు.
నారాయణపేట,మహా.
అవినీతికి పాల్పడుతూ నారాయణపేట రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీఓ) పత్లావత్ రామచందర్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. మంగళవారం మహబూబ్ నగర్ రేంజ్ ఏసీబీ అధికారులు పకడ్బందీగా వల పన్ని ఆయనను పట్టుకున్నారు. లేట్ బర్త్ సర్టిఫికెట్ల జారీ విషయంలో లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా ఈ బాగోతం వెలుగుచూసింది.
ఫిర్యాదుదారుడు, అలాగే అతని నలుగురు స్నేహితుల లేట్ బర్త్ సర్టిఫికెట్ల (జనన ధృవీకరణ పత్రాలు) రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ఫైలును ఆమోదించడానికి ఆర్డీఓ రామచందర్ రూ. 25,000 లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మంగళవారం బాధితుడి నుంచి ఆర్డీఓ తన కార్యాలయంలో ఆ నగదు తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచం డబ్బును ఆయన వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు.
విధులను పక్కదారి పట్టించి, అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమ మార్గంలో లబ్ధి పొందేందుకు యత్నించిన ఆర్డీఓ రామచందర్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం హైదరాబాద్ నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు (ఒకటవ అదనపు ప్రత్యేక న్యాయమూర్తి) ఎదుట ఆయనను హాజరుపరచనున్నట్లు ఏసీబీ పీఆర్వో ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు.
**అవినీతిపై సమాచారం ఇవ్వండి: ఏసీబీ విజ్ఞప్తి**
ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఎవరైనా అధికారిక పనుల కోసం లంచం డిమాండ్ చేస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వాట్సాప్ నంబర్ 9440446106, ఫేస్ బుక్ పేజీ , ఎక్స్/ట్విట్టర్ ఖాతా ద్వారా కూడా తమను సంప్రదించవచ్చని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా ఫిర్యాదు చేయవచ్చని, అవినీతిపై సమాచారం ఇచ్చే బాధితులు/ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని అధికారులు స్పష్టం చేశారు.