* సర్వే మ్యాప్‌తో రాష్ట్రంలో తొలి రిజిస్ట్రేషన్ పూర్తి.
* కుసుమంచిలో చారిత్రక ఘట్టం.
* భూధార్ నంబర్ కేటాయింపు.
* రైతులకు శాశ్వత భరోసా కల్పించడమే లక్ష్యమన్న మంత్రి పొంగులేటి.
హైదరాబాద్, మహా.
రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో మంగళవారం ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. దశాబ్దాలుగా భూ యజమానులను వేధిస్తున్న హద్దుల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సంకల్పంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘భూభారతి’ విధానం క్షేత్రస్థాయిలో తొలి అడుగు వేసింది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ పరిధిలోని కుసుమంచి మండలంలో సర్వే మ్యాప్‌తో కూడిన రాష్ట్రంలోనే మొట్టమొదటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. భూహక్కులకు శాశ్వత భరోసా కల్పించే ఈ నూతన విధానం భూ యజమానుల జీవితాల్లో సువర్ణాధ్యాయానికి నాంది పలుకుతుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.
ఈ కీలక పరిణామంపై మంత్రి స్పందిస్తూ రైతు జీవితం భూమితో విడదీయలేని బంధాన్ని కలిగి ఉంటుందని, ఆ భూమిపై హక్కులు స్పష్టంగా ఉన్నప్పుడే రైతుకు ధైర్యం, కుటుంబానికి భరోసా లభిస్తాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెవెన్యూ వ్యవస్థను సమూలంగా బలోపేతం చేస్తూ, ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చినట్లు ఆయన వివరించారు. ఈ సమన్వయంతో రూపొందించిన ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ద్వారా భూ వ్యవహారాల్లో పూర్తిస్థాయి పారదర్శకత వస్తుందని, ప్రతి భూమికి ఒక విశిష్ట గుర్తింపు లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కుసుమంచి మండలంలోని గట్టు సింగారం రెవెన్యూ గ్రామంలో జరిగిన ఈ తొలి రిజిస్ట్రేషన్ వివరాలను పరిశీలిస్తే, సర్వే నంబర్ 156/ఇ/1 లోని ఒక ఎకరా నాలుగు గుంటల భూమిని నేలకొండపల్లి మండలం ముత్తాపురం గ్రామానికి చెందిన రైతు భాగం కిషన్ రావు, కట్టా వెంకటేశ్వరరావుకు విక్రయించారు. ఈ క్రమంలో భూభారతి చట్టం నిబంధనల ప్రకారం భూమి హద్దులతో కూడిన పటాన్ని దస్తావేజుకు జతచేసి రిజిస్ట్రేషన్ నిర్వహించారు. అనంతరం సంబంధిత తహశీల్దార్ కార్యాలయం ద్వారా ఈ భూమికి ప్రత్యేకమైన ‘భూధార్’ నంబర్‌ను (795GCHDCUPJ7H0) కేటాయించారు. భూమికి సంబంధించిన ప్రతి అంగుళాన్ని కచ్చితత్వంతో నిర్ధారించడం వల్ల భవిష్యత్తులో హద్దుల గొడవలకు తావుండదని అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఖమ్మం జిల్లా కుసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, నారాయణపేట జిల్లా కొస్గి, రంగారెడ్డి జిల్లా అమన్‌గల్, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సర్వే ప్రక్రియలో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, అత్యంత ఆధునికమైన రోవర్ సాంకేతికతను వినియోగిస్తున్నామని, దీనివల్ల భూముల కొలతల్లో ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఈ ఐదు మండలాల్లో లభించే ఫలితాలను విశ్లేషించి, దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని విస్తరిస్తామన్నారు. భూభారతి పోర్టల్ ద్వారా అందే సేవలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని, భూవివాదాలు లేని తెలంగాణను ఆవిష్కరించడమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు.








