*ఎడ్యుకేషన్ హబ్ గా పరకాల*
*యువతకు నైపుణ్యాభివృద్ధి పెంచేందుకు ఏటీసీ కీలకం*
*పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి*
*జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే*
మహా వరంగల్ బ్యూరో ;
హన్మకొండ జిల్లా లోని పరకాల ప్రాంత యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను పెంచేందుకు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ కీలకంగా మారుతుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు.
మంగళవారం పరకాల పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ) ఏర్పాటుకు సంబంధించి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పలు ప్రభుత్వ స్థలాలను పరిశీలన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శిక్షణ అందించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందుతాయన్నారు. ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణం ద్వారా పరకాల పట్టణ అభివృద్ధికి తోడ్పాడుతుందని అన్నారు. అలాగే పరకాల పట్టణాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామని, అందులో భాగంగానే రాజుపేట సమీపంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి, ఏటీసీ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పరకాల పట్టణ అభివృద్ధికి,యువతకు నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా ఏటీసీ ఉపయోగపడుతుందని అన్నారు. పరకాల పట్టణానికి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. అంతకముందు ఎస్సీ, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ ను ఎమ్మెల్యే, కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, వైస్ చైర్ పర్సన్ దివ్య, పలువురు వార్డు కౌన్సిలర్ల తోపాటు ఆర్డీవో డాక్టర్ నారాయణ, తహసిల్దార్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, ఏటీసీ డిస్ట్రిక్ట్ కన్వీనర్ ఎం. చందర్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.








