*అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు*
*వరంగల్ లో భారీగా హాష్ ఆయిల్ పట్టివేత*
*రూ.2.50 కోట్ల విలువైన మాదకద్రవ్యాల స్వాధీనం*
*నలుగురు నిందితులు అరెస్ట్ జైలుకు తరలింపు*
మహా వరంగల్ బ్యూరో;
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు మరోసారి సత్తా చాటారు. వరంగల్ కమిషనరేట్
పరిధిలో పోలీసులు భారీ హాష్ ఆయిల్ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత ఖరీదైన ‘హాష్ ఆయిల్’ గంజాయి నుంచి తీసిన నూనె తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను వరంగల్ డ్రగ్ కంట్రోల్, క్యాట్ పార్టీ, ఇంతేజార్గంజ్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు 20 కిలోల హాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. దీని అంతర్జాతీయ మార్కెట్ విలువ సుమారు రూ. 2.50 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ కేసు పూర్తి వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.
*అరెస్టు అయిన వారి వివరాలు*
ఒడిషా రాష్ట్రం మల్కాన్జరి జిల్లాకు చెందిన హంటల్ సన్ను (23), హంటల్ సన్యాసి (23), కృష్ణా హంటల్ (56)లతో పాటు ఏపీలోని అల్లూరి జిల్లాకు చెందిన కండెల చిన్నబాబు (56) ఉన్నారు. మరో నిందితుడు కిలో పాండు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ప్రధాన నిందితుడు హంటల్ సన్ను తన స్వగ్రామంలోనే
గంజాయి సాగు చేస్తూ, దాని ద్వారా వచ్చే ఆదాయంతో జల్సాలు చేసేవాడు. కాగా గంజాయి అమ్మడం కంటే దాని నుంచి తీసే హాష్ ఆయిల్ కు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉండటంతో, నిందితుడు పాండు సూచన మేరకు గంజాయి మొక్కల నుండి ఆయిల్ సేకరించడం ప్రారంభించారు. ఓ ప్రత్యేక పరికరం ద్వారా 40 కిలోల హాష్ ఆయిల్ను సేకరించగా, అందులో 20 కిలోలను పాండు తీసుకున్నాడు. మిగతా 20 కిలోలను ఒక్కో కిలో ప్యాకెట్ల చొప్పున ప్యాక్ చేసి ముంబైలో విక్రయించేందుకు నిందితులు ప్లాన్ చేశారు. ఈ నెల 19న తుని రైల్వే స్టేషన్ నుండి కోనార్క్ ఎక్స్ప్రెస్లో నిందితులు ముంబై బయలుదేరారు. అయితే వరంగల్ స్టేషన్లో తనిఖీలు జరుగుతున్నాయనే అనుమానంతో ఇక్కడే దిగిపోయారు. మంగళవారం ఉదయం వరంగల్ బస్టాండ్ సమీపంలోని రైల్వే గూడ్స్ షెడ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో వారి వద్ద ఉన్న 20 కిలోల హాష్ ఆయిల్ బయటపడింది. భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుకున్న సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ఏఎప్పీ శుభం, ఏసీపీలు జితేందర్ రెడ్డి, జానీ నర్సింహులు, ఇన్స్ స్పెక్టర్లు సతీష్, షూకూర్, ఎస్ఐలు సందీప్, తేజ, ఆర్ఎస్ఐ లు ఏ.పూర్ణ చందర్ రెడ్డి, కె. మనోజ్ రెడ్డి, ఎల్.లింగారావు, క్యాట్ పార్టీ ఏఆర్ ఏఎస్ఐలు వి.సుబ్బిరామి రెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు బాల రాజు, కె.శ్రీరాములు, యం.డి రబ్బానీ, ఆర్.రాజ్కుమార్తో పాటు ఇంతేజార్గోంజ్ సిబ్బందిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు. గంజాయి, డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు.








