Mahaa Daily Exclusive

  మత్తు పదార్థాల నియంత్రణే లక్ష్యం…

Share

* క్రమశిక్షణ, నిజాయితీతో పనిచేయాలన్న ఐపీఎస్ అభిలాషా బిస్త్.
• టీజీపీఏలో ఎస్సైల ఇండక్షన్ ప్రోగ్రామ్ ప్రారంభం.

హైదరాబాద్, మహా.
విధి నిర్వహణలో ఎక్సైజ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని, ముఖ్యంగా ప్రజారోగ్యాన్ని కాపాడటంలో వారు ముందంజలో ఉండాలని టీజీపీఏ డైరెక్టర్, ఐపీఎస్ అధికారిణి అభిలాషా బిస్త్ పేర్కొన్నారు.
హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ ఆర్బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ వేదికగా మంగళవారం ఒక కీలక కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖకు నేరుగా ఎంపికైన సబ్ ఇన్‌స్పెక్టర్ల (AP-2026 బ్యాచ్) ఇండక్షన్ శిక్షణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అభిలాషా బిస్త్ ముఖ్యఅతిథిగా హాజరుకాగా, ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ శ్రీధర్ చామకూరి విశిష్ట అతిథిగా విచ్చేశారు. కాబోయే అధికారుల్లో వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించడం, వారిని ఆధునిక సవాళ్లను ఎదుర్కోగలిగేలా తీర్చిదిద్దడమే ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశ్యం.
మాదకద్రవ్యాల రవాణాను అరికట్టడం, అక్రమ మద్యం తయారీ , పంపిణీపై ఉక్కుపాదం మోపడం అధికారుల ప్రాథమిక బాధ్యతని ఆమె గుర్తుచేశారు. కేవలం చట్టాన్ని అమలు చేయడమే కాకుండా, క్రమశిక్షణ, నిజాయితీ నిబద్ధతను కలిగి ఉండాలని ఆమె అధికారులకు సూచించారు. అధికారాన్ని చట్టబద్ధంగా వినియోగిస్తూనే, సేవా దృక్పథంతో ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.
విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ, నేటి కాలంలో నేరాల స్వభావం మారుతోందని, దానికి అనుగుణంగా అధికారులు ఇంటెలిజెన్స్ ఆధారిత నిఘాపై దృష్టి పెట్టాలని సూచించారు. శాంతిభద్రతలను కాపాడుతూనే, అక్రమ కార్యకలాపాలను సమర్థవంతంగా అడ్డుకోవడంలో వృత్తిపరమైన నైపుణ్యం ప్రదర్శించాలన్నారు. ఈ ఇండక్షన్ శిక్షణ ద్వారా అధికారులకు అవసరమైన పరిజ్ఞానం, సాంకేతిక మెలకువలు , సానుకూల దృక్పథాన్ని అందిస్తామని తెలిపారు.
టీజీపీఏలో అందించే ఈ శిక్షణ ద్వారా ఎక్సైజ్ అధికారులు భవిష్యత్తులో ఎదురయ్యే క్లిష్టమైన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోగలరని అకాడమీ వర్గాలు వెల్లడించాయి. బాధ్యతాయుతమైన మరియు సమాజం పట్ల గౌరవం కలిగిన అధికారులను తయారు చేయడమే తమ లక్ష్యమని అకాడమీ పునరుద్ఘాటించింది. ఈ కార్యక్రమంలో అకాడమీ ఉన్నతాధికారులతో పాటు శిక్షణ పొందుతున్న ఎస్సైలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతనంగా ఎంపికైన ఈ అధికారులకు అందించే శిక్షణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ పనితీరును మరింత మెరుగుపరుస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.