Mahaa Daily Exclusive

  హర్మూజ్‌ దిగ్బంధం….

Share

* ప్రపంచానికి ‘చమురు’ సెగ!
* జలసంధిని తెరిచేందుకు ఆరు నెలల సమయం.
* పెంటగాన్‌ సంచలన నివేదిక.
* ముదురుతున్న పశ్చిమాసియా యుద్ధం.
* ఆకాశానికి చమురు ధరలు.
* కుప్పకూలనున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ?
వాషింగ్టన్‌, మహా.
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి దిగ్బంధం గురించి అమెరికా రక్షణ శాఖ ‘పెంటగాన్’ వెల్లడించిన వాస్తవాలు ఇప్పుడు ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఒకవేళ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో హర్మూజ్ జలసంధిలో సముద్రపు మైన్లను (మందుపాతరలు) మోహరిస్తే, వాటిని పూర్తిగా తొలగించి జలమార్గాన్ని మళ్లీ సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు కనీసం ఆరు నెలల సమయం పడుతుందని పెంటగాన్ అంచనా వేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ సుదీర్ఘ నిరీక్షణ కాలంలో చమురు సరఫరా పూర్తిగా స్తంభించిపోయి, ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు కళ్లుచెదిరే రీతిలో పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా వినియోగించే చమురులో సుమారు 20 శాతం కేవలం ఈ హర్మూజ్ జలసంధి గుండానే రవాణా అవుతుంది. ఓమన్‌, ఇరాన్‌ల మధ్య ఉండే ఈ ఇరుకైన జలమార్గం గుండానే సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఇరాక్ వంటి దేశాల నుంచి ముడి చమురు అంతర్జాతీయ మార్కెట్‌కు చేరుకుంటుంది. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఈ మార్గంలో మైన్లను మోహరించడం ద్వారా నౌకల రాకపోకలను అడ్డుకోవచ్చని, అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా గొలుసు తెగిపోతుందని పెంటగాన్ హెచ్చరించింది. సముద్ర గర్భంలో అత్యంత రహస్యంగా అమర్చే ఈ మందుపాతరలను గుర్తించి, వాటిని నిర్వీర్యం చేయడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ అని, ఇందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నౌకలు, నిపుణులు అవసరమని పెంటగాన్ తన నివేదికలో స్పష్టం చేసింది.
ఈ ఆరు నెలల గడువు అనేది ప్రపంచ దేశాలకు ఒక పీడకల లాంటిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చమురు ధరలు ఒక్కసారిగా బారెల్‌కు 150 నుంచి 200 డాలర్ల మార్కును దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని, దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారతదేశం వంటి దేశాలపై ఈ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండనుంది. రూపాయి విలువ పతనం కావడంతో పాటు ద్రవ్యోల్బణం పెరిగి దేశ ఆర్థిక వృద్ధి రేటు కుంటుపడే అవకాశం ఉంది. హర్మూజ్ జలసంధిపై నియంత్రణ సాధించేందుకు అగ్రరాజ్యాలు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఈ ప్రాంతంలో నెలకొన్న అస్థిరత ఏ క్షణంలోనైనా చమురు సంక్షోభానికి దారితీయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.