Mahaa Daily Exclusive

  పక్క రాష్ట్రాల దూరవిద్య డిగ్రీలు చెల్లవు…

Share

**పక్క రాష్ట్రాల దూరవిద్య డిగ్రీలు చెల్లవు**
**కొలువులకు పనికిరాని స్టడీ సెంటర్ సర్టిఫికెట్లు**
**వేలాది మంది అభ్యర్థులకు హైకోర్టు షాక్**
హైదరాబాద్, మహా.
దూర విద్యా విధానంలో డిగ్రీలు పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇతర రాష్ట్రాలకు చెందిన విశ్వవిద్యాలయాలు తమ రాష్ట్ర సరిహద్దులు దాటి తెలంగాణలో నిర్వహించే స్టడీ సెంటర్ల ద్వారా పొందే డిగ్రీలు ప్రభుత్వ ఉద్యోగాలకు ఏమాత్రం పనికిరావని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇటువంటి సర్టిఫికెట్లు కేవలం కాగితపు ముక్కలే తప్ప, సర్కారీ కొలువులకు అర్హత కాదని తేల్చి చెప్పింది. ఈ సంచలన తీర్పుతో ఇతర రాష్ట్రాల వర్సిటీల ద్వారా డిగ్రీలు పొందిన వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. ముఖ్యంగా లైబ్రేరియన్ పోస్టుల భర్తీ వివాదంలో హైకోర్టు ఈ కీలక నిర్ణయాన్ని వెలువరించింది.
**వివాదానికి మూలం లైబ్రేరియన్ పోస్టులే**
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022లో విడుదల చేసిన లైబ్రేరియన్ పోస్టుల నోటిఫికేషన్ ఈ వివాదానికి అసలు మూలంగా నిలిచింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న కొందరు అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్‌లోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ద్వారా మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ పూర్తి చేశారు. అయితే వారు ఈ డిగ్రీని ఏపీలో కాకుండా తెలంగాణలో ఉన్న ఆ వర్సిటీ స్టడీ సెంటర్ల ద్వారా దూరవిద్యా విధానంలో పొందారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో వీరి డిగ్రీలు చెల్లవని కమిషన్ తిరస్కరించడంతో అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గతంలో ఇదే తరహా డిగ్రీలతో కొందరికి ఉద్యోగాలు వచ్చాయని వారు వాదించినప్పటికీ, ధర్మాసనం ఆ వాదనను తోసిపుచ్చింది.
**యూజీసీ నిబంధనలే ప్రామాణికం**
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో యూజీసీ నిబంధనలను ప్రధానంగా ప్రస్తావించింది. ఒక రాష్ట్ర చట్టం కింద ఏర్పడిన విశ్వవిద్యాలయం తన కార్యకలాపాలను ఆ రాష్ట్ర సరిహద్దులకే పరిమితం చేయాలని, ఇతర రాష్ట్రాల్లో స్టడీ సెంటర్లు పెట్టి డిగ్రీలు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. 2013లో యూజీసీ జారీ చేసిన పబ్లిక్ నోటీసు ప్రకారం ఏ వర్సిటీ కూడా తన ప్రాదేశిక అధికార పరిధిని దాటి వెళ్లకూడదని కోర్టు గుర్తు చేసింది. తెలంగాణలో ఏపీ వర్సిటీలు సెంటర్లు నిర్వహించడం చట్టవిరుద్ధమని ధర్మాసనం తేల్చి చెప్పింది.
**గత తప్పులు కొత్త తప్పులకు సమర్థన కావు**
గతంలో జరిగిన తప్పులను సాకుగా చూపి కొత్త తప్పులను సమర్థించలేమని కోర్టు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. 2017 నియామకాల్లో ఇటువంటి డిగ్రీలను అంగీకరించారు కదా అన్న అభ్యర్థుల వాదనను తోసిపుచ్చుతూ, గతంలో జరిగిన అవకతవకలు భవిష్యత్తుకు మార్గదర్శకాలు కాబోవని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనలు కూడా స్టడీ సెంటర్ల నిర్వహణకు అనుమతించవని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు కేవలం లైబ్రేరియన్ పోస్టులకే కాకుండా రాబోయే అన్ని ప్రభుత్వ నియామకాలపై ప్రభావం చూపనుంది. ఆచార్య నాగార్జున, అన్నామలై, మదురై కామరాజ్ వంటి వర్సిటీల ద్వారా స్టడీ సెంటర్లలో చదివిన అభ్యర్థులు ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

Latest