**నిప్పుల కొలిమిలో భారతం**
**ప్రపంచంలోనే అత్యంత వేడి దేశంగా రికార్డు**
**వందలో 92 నగరాలు మనవే**
**తెలంగాణకు రెడ్ వార్నింగ్ జారీ**
**అగ్నిగుండంగా మారిన ఉపఖండం**
హైదరాబాద్, మహా.
భారతదేశం ప్రస్తుతం అగ్నిగుండంలా మారింది. ఈ వారం ప్రపంచవ్యాప్తంగా నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతల గణాంకాలను పరిశీలిస్తే విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచంలోని వంద అత్యంత వేడి నగరాల జాబితాలో ఏకంగా 92 నగరాలు ఒక్క భారతదేశంలోనే ఉండటం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. భూమిపై అత్యంత వేడి దేశంగా భారత్ అవతరించినట్లు అంతర్జాతీయ వాతావరణ సంస్థల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నిప్పులు చెరుగుతున్న భానుడి ప్రతాపానికి ఉత్తర , మధ్య భారతదేశం విలవిలలాడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో సామాన్యులు గడప దాటాలంటేనే భయపడుతున్నారు.
**తెలంగాణపై సూర్యుడి ప్రతాపం**
రాష్ట్రంలో ఎండల తీవ్రత పరాకాష్టకు చేరింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వాతావరణం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఈ జిల్లాలకు ‘రెడ్ వార్నింగ్’ జారీ చేసింది. రాజధాని హైదరాబాద్‌లో కూడా వేడి తీవ్రత తగ్గే సూచనలు కనిపించడం లేదు. నగరంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ, కాంక్రీట్ వనం కావడంతో గాలిలో వేడి తీవ్రత సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కరీంనగర్, వరంగల్ మరియు నల్గొండ జిల్లాల్లో 43 నుంచి 45 డిగ్రీల వేడితో కూడిన ‘ఆరెంజ్ అలర్ట్’ కొనసాగుతోంది.
**తేమతో కూడిన వేడి.. భయంకరమైన ‘రియల్ ఫీల్’**
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం మరియు సూర్యాపేట జిల్లాల్లో పరిస్థితి మరింత భీకరంగా ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రత 42 డిగ్రీలుగా నమోదవుతున్నప్పటికీ, గాలిలో ఉన్న విపరీతమైన తేమ కారణంగా మనిషి శరీరానికి అది 45 డిగ్రీల కంటే ఎక్కువ వేడిలా అనిపిస్తోంది. దీనిని వాతావరణ భాషలో ‘రియల్ ఫీల్’ లేదా ‘హ్యూమిడ్ హీట్’ అని పిలుస్తారు. ఈ రకమైన వేడి వల్ల మనిషి శరీరం త్వరగా అలసిపోవడమే కాకుండా వడదెబ్బ తగిలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని వైద్యులు మరియు అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.








