**కమలం గూటికి మల్లారెడ్డి ఫ్యామిలీ?
**గులాబీ బాస్‌కు షాక్ ఇచ్చేలా ప్రీతి రెడ్డి వ్యాఖ్యలు!**
**మోదీతో భేటీ.. ఆపై కీలక వెల్లడి**
**మల్కాజిగిరి టికెట్ చుట్టూ తిరుగుతున్న రాజకీయం**
**మల్కాజిగిరి కోటలో మారిన సమీకరణలు**
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కలర్‌ఫుల్ లీడర్‌గా పేరున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కుటుంబం ఇప్పుడు ఖచ్చితమైన ‘పొలిటికల్ ప్రాబేషన్ పీరియడ్’లో ఉన్నట్లు కనిపిస్తోంది. పైన గులాబీ జెండా కనిపిస్తున్నా.. లోపల మాత్రం కమలం వికసించేలా పావులు కదుపుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి వరుసగా బీజేపీ నేతలతో భేటీ అవ్వడం.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బహిరంగంగా ప్రశంసలు కురిపించడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. కేవలం వ్యాపార ప్రయోజనాల కోసమే ఈ భేటీలని పైకి చెబుతున్నప్పటికీ.. అసలు కథ మాత్రం వేరే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
**ఏఐ క్యాంపస్ సాకు.. అసలు లక్ష్యం వేరే!**
ఇటీవల మల్లారెడ్డి కుటుంబ సమేతంగా ప్రధాని మోదీని కలవడం.. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కీలక నేతలతో చర్చలు జరపడం చర్చనీయాంశమైంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్మించిన ‘ఏఐ క్యాంపస్’ ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించేందుకే ఈ భేటీ అని ఆ కుటుంబం అధికారికంగా చెబుతోంది. అయితే డిజిటల్ ఇండియా పనుల కోసమే తిరుగుతున్నామని చెబుతున్న ప్రీతి రెడ్డి.. తాజా వీడియోలో కొన్ని సంచలన వాస్తవాలను బయటపెట్టారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తాము బీజేపీ నుంచి మల్కాజిగిరి టికెట్ ఆశించామని.. కానీ అది దక్కలేదని ఆమె బహిరంగంగానే అంగీకరించారు. అప్పుడే బీజేపీలోకి రావాలని గట్టి ప్రయత్నాలు జరిగాయని ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది.
**బీఆర్ఎస్ టికెట్‌ను ఎందుకు తిరస్కరించారు?**
అంతేకాకుండా.. 2024 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినాయకత్వం తమకు పోటీ చేసే అవకాశం కల్పించినా.. ఆ ఆఫర్‌ను వారు తిరస్కరించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తమకు కమలం తీర్థం పుచ్చుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ.. టికెట్ సమీకరణలు కుదరకపోవడంతోనే ఆగిపోయినట్లు తెలుస్తోంది. గులాబీ పార్టీలో ఉంటూనే తమ భవిష్యత్తు అంబీషన్లను బీజేపీతో ముడిపెట్టుకోవడం చూస్తుంటే.. బీఆర్ఎస్ తో బంధం ఇప్పుడు కేవలం సెకండరీ అని వారు భావిస్తున్నట్లు అర్థమవుతోంది. మల్లారెడ్డికి ఉన్న భారీ విద్యా సంస్థలు.. ఇతర వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో సత్సంబంధాలు కొనసాగించడం వ్యూహాత్మక అడుగుగా కనిపిస్తోంది.
**కమల దళం గ్రీన్ సిగ్నల్ కోసమే ఎదురుచూపులు**
ప్రస్తుతానికి మల్లారెడ్డి ఫ్యామిలీ బీజేపీలోకి అధికారికంగా చేరనప్పటికీ.. రాజకీయంగా మాత్రం ఆ పార్టీలో భాగం కావడానికి గట్టిగానే ట్రై చేస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. అటు అదిష్టానం కూడా వీరి చేరికపై ఆచి తూచి అడుగులు వేస్తోంది. మల్కాజిగిరి వంటి కీలక నియోజకవర్గంలో మల్లారెడ్డి ఫ్యామిలీకి ఉన్న పట్టును ఉపయోగించుకోవాలని ఒక వర్గం భావిస్తుంటే.. ముందుగా వారి విధేయతను నిరూపించుకోవాలని మరో వర్గం అంటోంది. ఏది ఏమైనా ప్రీతి రెడ్డి తాజా వ్యాఖ్యలు చూస్తుంటే.. మల్లారెడ్డి ఫ్యామిలీకి గులాబీ గూటిలో కాలం చెల్లిపోయిందని.. కేవలం అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు.








