Mahaa Daily Exclusive

  ఉక్కు నగరం.. ఇక ‘డేటా’ నగరం!

Share

  • ఉక్కు నగరం.. ఇక ‘డేటా’ నగరం!
  • విశాఖలో రూ.1.35 లక్షల కోట్లతో గూగుల్ ఏఐ హబ్ శంకుస్థాపన
  • భారత్‌లోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి
  • 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం: మంత్రి నారా లోకేష్

విశాఖపట్నం,మహా.
దశాబ్దాలుగా ఉక్కు నగరంగా ఖ్యాతి గడించిన విశాఖపట్నం భవిష్యత్తులో ప్రపంచ స్థాయి ‘డేటా సిటీ’గా అవతరించనుందని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. ఏప్రిల్ 28వ తేదీ విశాఖ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తోందని ఆయన అన్నారు. మంగళవారం విశాఖలో గూగుల్ క్లౌడ్ ఇండియా ‘ఏఐ హబ్’ (డేటా సెంటర్) నిర్మాణానికి ఆయన లాంఛనంగా శంకుస్థాపన చేశారు. భారతదేశంలోనే గూగుల్ సంస్థ పెడుతున్న అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (FDI) విశాఖకు రావడం గర్వకారణమన్నారు. ఈ బృహత్తర ప్రాజెక్టు కోసం తమ అమూల్యమైన భూములను ఇచ్చిన రైతులకు, స్థానిక యువతకు ఆయన ప్రత్యేకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ డేటా సెంటర్ ఏర్పాటులో పూర్తి సహకారం అందిస్తున్న అదానీ కనెక్స్, ఎయిర్‌టెల్ నెక్స్‌ట్రా సంస్థలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
**లక్షల కోట్ల పెట్టుబడి.. అపార ఉపాధి అవకాశాలు**
రూ.1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ ఏఐ డేటా సెంటర్‌తో గ్లోబల్ ఐటీ మ్యాప్‌లోకి విశాఖ సగర్వంగా అడుగుపెట్టిందని మంత్రి లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ పెట్టుబడులతో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని, ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ మేనేజ్‌మెంట్, మెకానికల్ తదితర విభిన్న రంగాల్లో ఉపాధి అవకాశాలు మెండుగా వస్తాయని వివరించారు. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని అనేది తమ ప్రభుత్వ విధానమని, అదే సమయంలో అభివృద్ధి వికేంద్రీకరణే తమ ప్రధాన నినాదమన్నారు. ఇందులో భాగంగానే క్లస్టర్ బేస్డ్ విధానంతో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు వేర్వేరు రంగాల్లో పెట్టుబడులు తీసుకొస్తూ రాష్ట్రాన్ని సమగ్ర వికాసం వైపు నడిపిస్తున్నామన్నారు. మున్ముందు విశాఖ ప్రాంతాన్ని దేశంలోనే తొలి ‘ట్రిలియన్ డాలర్ ఎకనామిక్ రీజియన్’గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు.
**బుల్లెట్ ట్రైన్ వేగంతో అభివృద్ధి**
రాష్ట్రంలో ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ (Speed of doing business) సాకారం అవుతోందని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే.. ఏపీలో మాత్రం ‘డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్’ సర్కార్ పనిచేస్తోందని అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ సంపూర్ణ సహకారంతో దేశంలోకి వస్తున్న పెట్టుబడుల్లో ఏకంగా 25 శాతం మేర ఆంధ్రాకే వస్తున్నాయని వెల్లడించారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్‌ను హైటెక్ సిటీగా మార్చిన ఘనమైన ట్రాక్ రికార్డు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సొంతమని, ఆ అనుభవంతోనే ఇప్పుడు విశాఖలోని ఏఐ డేటా సెంటర్‌తో కొత్త ట్రాజెక్టరీ ఆవిష్కృతం కాబోతోందన్నారు. ఆర్సెలార్ మిట్టల్, గూగుల్ లాంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి క్యూ కట్టడమే ప్రభుత్వ పనితీరుకు, రాష్ట్రంపై వాళ్లకున్న విశ్వాసానికి ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. ఈ టెక్ ప్రాజెక్టులతో ప్రపంచం గతంలో ఎన్నడూ చూడని నవ భారతం ఆవిష్కృతం అవుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.
**ప్రజా ప్రభుత్వానిది గూగుల్.. వాళ్లది గొడ్డలి**
గత వైకాపా ప్రభుత్వంపై లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 2019-24 మధ్య రాష్ట్రంలో పెద్ద ఎత్తున విధ్వంసం జరిగిందని, దానిని పునరుద్ధరిస్తారనే నమ్మకంతోనే ప్రజలు ఈ ప్రజా ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టారని గుర్తుచేశారు. “మా ప్రజా ప్రభుత్వానిది ‘గూగుల్’ విధానమైతే.. ఆ ప్రతిపక్ష పార్టీది ‘గొడ్డలి’ విధానం. కొందరు పనిగట్టుకుని కేసులు వేసి ఈ బృహత్తర ప్రాజెక్టును అడ్డుకునేందుకు, ఇబ్బందులు పెట్టేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అడుగడుగునా అడ్డుకున్న వారే.. ఇప్పుడు గూగుల్ క్రెడిట్ కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు సీసీడీ రోగి ప్రయత్నిస్తున్నాడు” అంటూ పరోక్షంగా సెటైర్లు వేశారు.