Mahaa Daily Exclusive

  ఒడిశాలో నిబంధనల పేరుతో బ్యాంకు అధికారుల అమానుషత్వం

Share

  • నిబంధనల గుండెబండ.. ఒక అమాయకుడి కంటతడి!
  • ఆమె చనిపోయిందనడానికి.. ఈ అస్థిపంజరమే నా సాక్ష్యం బాబూ!
  • నిరక్షరాస్యుడి ఆవేదన ముందు తలదించుకున్న వ్యవస్థ
  • ఒడిశాలో నిబంధనల పేరుతో బ్యాంకు అధికారుల అమానుషత్వం

హైద్రాబాద్, మహా.
ఆధునిక సమాజంలో నిబంధనలు మనిషికి సేవ చేయాలి.. కానీ, ఆ నిబంధనలే గుండెబండలై ఒక పేదవాడి అమాయకత్వాన్ని ఎంతగా వెక్కిరిస్తాయో చెప్పడానికి ఒడిశాలో జరిగిన ఈ హృదయ విదారక ఘటనే సజీవ సాక్ష్యం. అక్షరం ముక్క రాని ఓ గిరిజనుడికి రూల్స్ పేరుతో బ్యాంకర్లు పెట్టిన ఇబ్బందులు, ఆ నిస్సహాయతలోంచి ఆ అమాయకుడు ఎంచుకున్న మార్గం ప్రతి ఒక్కరి కంటతడి పెట్టిస్తోంది.
కియోంజర్ జిల్లా దియానలి గ్రామానికి చెందిన జీతూ ముండా (50) అనే గిరిజనుడిది రెక్కాడితే గానీ డొక్కాడని బతుకు. అతనికి ఉన్న ఒకే ఒక్క ఆసరా, సొంత అక్క కల్రా ముండా. విధి వకరించి అనారోగ్యంతో ఆమె ఈ ఏడాది జనవరిలో కన్నుమూసింది. ఆమె మాలిపోసిలోని ఒడిశా గ్రామీణ బ్యాంకు ఖాతాలో పశువులు అమ్మగా వచ్చిన ఓ ఇరవై వేల రూపాయలు ఉన్నాయి. నా అనే వాళ్లు లేని జీతూ.. ఆ కాస్త డబ్బు తీసుకుని అవసరాలు తీర్చుకుందామని బ్యాంకు గడప తొక్కాడు. కానీ, ఆ బ్యాంకు నిబంధనలకు అక్షరాలు రాని ఆ పేదవాడి బాధ అర్థం కాలేదు. “ఖాతాదారు ఉంటేనే ఇస్తాం.. లేదంటే డెత్ సర్టిఫికెట్, వారసత్వ ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలి” అంటూ బ్యాంకర్లు పదే పదే తిప్పి పంపారు.
సర్టిఫికెట్ అంటే ఏమిటో, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఎలా తిరగాలో తెలియని ఆ గిరిజనుడు ఎన్నోసార్లు బ్యాంకు అధికారుల కాళ్ల వేళ్లా పడ్డాడు. తన అక్క నిజంగానే చనిపోయిందని, దయచేసి ఆ డబ్బులు ఇవ్వాలని వేడుకున్నాడు. అయినా వారి మనసు కరగలేదు. అధికారుల కఠిన వైఖరితో విసిగిపోయిన ఆ అమాయకుడికి మరో దారి కనిపించలేదు. తన అక్క చనిపోయిందని నిరూపించడానికి.. బరువెక్కుతున్న గుండెతో నేరుగా స్మశానానికి వెళ్లాడు. పది కాలాల పాటు పదిలంగా ఉందామనుకున్న ఆమె సమాధిని తన చేతులతో తానే తవ్వాడు. ఆమె అస్థిపంజరాన్ని వెలికితీసి ఒక గోనెసంచిలో సర్దుకున్నాడు.
మండుతున్న ఎండలో, కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఆ బరువైన సంచిని భుజాన వేసుకుని మూడు కిలోమీటర్లు నడిచాడు. నేరుగా బ్యాంకులో అడుగుపెట్టి.. “ఇదిగో బాబూ.. నా అక్క చనిపోయిందనడానికి నా దగ్గర ఉన్న సాక్ష్యం ఇదే.. దయచేసి ఆ డబ్బులు ఇవ్వండి” అంటూ ఆ అస్థిపంజరాన్ని అధికారుల ముందు ఉంచాడు. ఆ దృశ్యం చూసి బ్యాంకు సిబ్బంది భయంతో వణికిపోయారు కానీ.. ఆ భయం వెనుక దాగున్న ఒక పేదవాడి నిస్సహాయతను చూసి అక్కడున్న కస్టమర్ల గుండెలు బరువెక్కాయి.
చివరకు పోలీసులు రంగంలోకి దిగి జీతూ ముండాకు సర్దిచెప్పి, ఆ అస్థిపంజరానికి తిరిగి అంత్యక్రియలు నిర్వహించారు. నిబంధనల గురించి అతనికి అర్థమయ్యేలా చెప్పడంలో బ్యాంకర్లు విఫలమయ్యారని మండిపడ్డారు. అధికారుల చొరవతో అతనికి ఆ సొమ్ము అందేలా హామీ లభించింది.
అయితే, ఈ ఘటన ఒక చేదు నిజాన్ని మన కళ్ల ముందు ఉంచింది. చదువురాని సామాన్యుడికి అర్థంకాని చట్టాలు, కాగితాలపై చూపే శ్రద్ధ మనిషి ఆకలిపై చూపని వ్యవస్థ.. ఒక అమాయకుడిని ఎంతటి మానసిక క్షోభకు గురిచేసిందో చాటిచెప్పింది. మనిషి ప్రాణం కన్నా, వారి ఆవేదన కన్నా ఈ నిబంధనలే గొప్పవా? అన్న ప్రశ్న ప్రతి ఒక్కరినీ తొలిచివేస్తోంది.

Latest