- ఉగ్రవాదానికి ఆశ్రయమిస్తే మూల్యం తప్పదు.
- రక్షణ మంత్రి రాజ్‌నాథ్ హెచ్చరిక.
- సీమాంతర ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ ప్రమాణాలు వద్దు.
బిష్కెక్,మహా.
ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పిస్తూ, ప్రోత్సహిస్తున్న దేశాలు అందుకు తగిన తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఘాటుగా హెచ్చరించారు. కిర్గిస్థాన్ వేదికగా జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) రక్షణ మంత్రుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, ఉగ్రవాదం కేవలం ఒక దేశానికో లేదా ప్రాంతానికో పరిమితమైన సమస్య కాదని, ఇది యావత్ మానవాళికి పెనుముప్పుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన కిరాతక ఉగ్రదాడిని ప్రస్తావించిన ఆయన, ఆ ఘటన ప్రపంచాన్ని నివ్వెరపరిచిందని పేర్కొన్నారు. అయితే, ఆ దాడికి గట్టి జవాబుగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా తప్పించుకోలేరని నిరూపించామని గుర్తుచేశారు.
పరోక్షంగా పాకిస్థాన్‌ను ఉద్దేశిస్తూ, ప్రభుత్వ మద్దతుతో కొనసాగే సీమాంతర ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ విస్మరించకూడదని రాజ్‌నాథ్ పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అంతర్జాతీయ సమాజం ద్వంద్వ ప్రమాణాలను వీడాలని, ఈ విషయంలో ఎస్సీవో సభ్యదేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. తీవ్రవాదం, ఉగ్రవాదం వల్ల ఆర్థిక నష్టంతో పాటు అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, ఉద్రిక్తతల పరిష్కారానికి దౌత్య మార్గాలే శ్రేయస్కరమని ఆయన సూచించారు. ఉగ్రవాదులకు సాయపడుతూ ఆశ్రయం కల్పించేవారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో ఎస్సీవో వెనకాడకూడదని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
దేశ సార్వభౌమాధికారానికి మరియు భద్రతకు ముప్పు వాటిల్లితే ఎదుర్కొనేందుకు భారత్ సర్వదా సిద్ధంగా ఉంటుందని రక్షణ మంత్రి ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. గత కొన్నేళ్లుగా జరిగిన వరుస ఘర్షణల్లో అనేకమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, భారీ ఆస్తి నష్టం వాటిల్లిందని గుర్తు చేస్తూ, శాంతి స్థాపన కోసం ప్రపంచ దేశాలన్నీ ఏకోన్ముఖంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. అంతర్జాతీయ వేదికపై ఉగ్రవాద నిర్మూలన విషయంలో భారత్ తన దృఢ నిశ్చయాన్ని మరోసారి చాటిచెప్పింది.








