Mahaa Daily Exclusive

  ఐదు జిల్లాల్లో విమానయానానికి మార్గం సుగమం. వరంగల్, ఆదిలాబాద్‌లో జోరందుకున్న పనులు.

Share

  • ఐదు జిల్లాల్లో విమానయానానికి మార్గం సుగమం.
  • వరంగల్, ఆదిలాబాద్‌లో జోరందుకున్న పనులు.
  • కొత్త విమానాశ్రయాలకు కేంద్రం పచ్చజెండా.

హైదరాబాద్, మహా.

తెలంగాణ రాష్ట్రంలో సామాన్యుడికి సైతం విమాన ప్రయాణాన్ని చేరువ చేయాలన్న సంకల్పం దిశగా మరో కీలక అడుగు పడింది. రాష్ట్రవ్యాప్తంగా విమానయాన రంగాన్ని విస్తరించడంలో భాగంగా గతంలో ప్రతిపాదించిన ఆరు విమానాశ్రయాల్లో ఐదింటికి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భౌగోళిక, సాంకేతిక కారణాల రీత్యా మహబూబ్‌నగర్ ప్రతిపాదన ఒక్కటి ప్రస్తుతానికి పక్కకు వెళ్లగా, మిగిలిన ఐదు ప్రాంతాల్లో విమాన సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేయడం విశేషం.
చారిత్రక నగరమైన వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయానికి సంబంధించి ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ ఓ కొలిక్కి రావడంతో, అక్కడ ‘బ్రౌన్ ఫీల్డ్’ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ఏఏఐ త్వరలోనే సమగ్ర ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్) సిద్ధం చేయనుంది. అటు ఆదిలాబాద్‌లోనూ విమానాశ్రయం ఏర్పాటుకు అదనంగా అవసరమైన 430.30 ఎకరాల భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలోనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రెండు ప్రాంతాల్లో పనులు అత్యంత వేగంగా జరుగుతుండటంతో రానున్న మూడేళ్లలోనే విమానాలు గాల్లోకి ఎగురుతాయని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా అంతర్గావ్‌లో విమానాశ్రయ అభివృద్ధికి సంబంధించి 2025 డిసెంబరులో ప్రాథమిక పరిశీలన చేసిన ఏఏఐ, ఈ ఏడాది ఫిబ్రవరిలో తన నివేదికను సమర్పించింది. అక్కడ ప్రీ-ఫీజిబిలిటీ పరీక్షల్లో సానుకూల ఫలితాలు రావడంతో భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నిజామాబాద్ జిల్లాలోనూ 1,612 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయ ఏర్పాటుకు ఏఏఐ పచ్చజెండా ఊపింది. ఇందులో దాదాపు సగం ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటం ప్రాజెక్టుకు కలిసొచ్చే అంశం. అయితే కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి సంబంధించి మాత్రం పాత స్థలాలు సరిపోవని తేలడంతో, మరోచోట భూసేకరణ చేపట్టాలని కేంద్రం సూచించింది.
పాలమూరు జిల్లా ప్రజల విమాన కలలకు మాత్రం సాంకేతిక అడ్డంకులు ఎదురయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర వద్ద ప్రతిపాదించిన స్థలం శంషాబాద్ విమానాశ్రయానికి అతి సమీపంలో ఉండటంతో నిబంధనల ప్రకారం జీఎంఆర్ సంస్థ నుంచి అనుమతి లభించడం కష్టతరంగా మారింది. దీనికి తోడు ప్రతిపాదిత రన్వేకు సమీపంలో కొండలు ఉండటం, విమానాలు దిగే మార్గంలో సోలార్ ప్లాంటు అడ్డుగా ఉండటం వంటి కారణాలతో ఈ ప్రతిపాదనను ఏఏఐ తిరస్కరించింది. ఏదేమైనా, ఈ కొత్త విమానాశ్రయాల ఏర్పాటుతో తెలంగాణ జిల్లాల ముఖచిత్రం మారిపోవడంతో పాటు, పారిశ్రామికంగా రాష్ట్రం మరింత పురోగతి సాధిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Latest