Mahaa Daily Exclusive

  మందుల కొనుగోళ్లలో గోల్‌మాల్‌. 150 కోట్ల అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి!

Share

  • మందుల కొనుగోళ్లలో గోల్‌మాల్‌.
  • 150 కోట్ల అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి!
  • వైద్యం అందక పేదలు విలవిల.
  • ఎక్స్‌పైరీ మందులతో నిధులు హాంఫట్‌.
  • బిజెపి జాతీయ నాయకులు, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆగ్రహం.

హైదరాబాద్ , మహా.

రాష్ట్రంలో విద్యా, వైద్య రంగాలు కుదేలయ్యాయని, ముఖ్యంగా ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి కోరలు చాస్తోందని బిజెపి జాతీయ నాయకులు, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌లో సుమారు 150 కోట్ల రూపాయల విలువైన మందుల కొనుగోళ్లలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కాలం చెల్లడానికి సిద్ధంగా ఉన్న మందులను భారీ స్థాయిలో కొనుగోలు చేసి, వాటిని వినియోగించకుండా వదిలేసి, ఇప్పుడు బయో మెడికల్ వేస్ట్ పేరిట వాటిని నాశనం చేయడానికి మళ్లీ ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తక్షణమే స్పందించి ప్రజలకు వాస్తవాలు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితిపై ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేస్తూ, పేదలకు అండగా ఉండాల్సిన దవాఖానాలు నేడు కనీస సౌకర్యాలు లేక వెలవెలబోతున్నాయని పేర్కొన్నారు. డాక్టర్లు రోగులను పరీక్షించడానికి కనీసం గదులు లేక కారిడార్లలోనే చికిత్స అందిస్తున్నారని, స్ట్రెచర్ల మీదనే ప్రిస్క్రిప్షన్లు రాయాల్సిన దౌర్భాగ్య స్థితి నెలకొందని ఆయన విమర్శించారు. మందులు, గ్లౌజులు, సర్జికల్ మెటీరియల్స్ వంటి ప్రాథమిక అవసరాలకు కూడా కొరత ఏర్పడిందని, ప్రసవం కోసం వచ్చే గర్భిణులు సైతం బయట నుంచి సామగ్రి కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితిని తాను స్వయంగా చూశానని వాపోయారు. ఆసుపత్రులకు అందాల్సిన హెచ్‌డీఎస్, ఆరోగ్యశ్రీ నిధులు సకాలంలో రాకపోవడం వల్ల వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమైందని ఆయన ఆరోపించారు.
మందుల కొనుగోలు విధానంలో జరుగుతున్న లోపాలను ఎత్తిచూపుతూ, ఐదు లక్షల పైబడి జరిగే కొనుగోళ్లు ఓపెన్ టెండర్ ద్వారా, అంతకంటే పెద్ద స్థాయిలో జరిగేవి కార్పొరేషన్ ద్వారా పారదర్శకంగా జరగాలని వెంకటరమణారెడ్డి గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం వచ్చిన ఆరోపణల ప్రకారం, అవసరానికి మించి ఎక్స్‌పైరీకి దగ్గరగా ఉన్న మందులను కొనుగోలు చేయడం వెనుక ఉన్న అంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ఈ టెండర్లు ఎప్పుడు ఇచ్చారు, ఏ కంపెనీలు పాల్గొన్నాయి, చివరికి ఏ కంపెనీకి టెండర్ దక్కింది అనే విషయాలతో కూడిన టెక్నికల్ మరియు ఫైనాన్షియల్ బిడ్ వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని కోరారు. ఆ మందుల తయారీ తేదీ, ఎక్స్‌పైరీ తేదీలను వెల్లడిస్తే అసలు నిజం బయటపడుతుందని ఆయన స్పష్టం చేశారు.
బయో మెడికల్ వేస్ట్ నిర్వహణ అనేది అత్యంత జాగ్రత్తతో కూడుకున్న పని అని, సిరంజీలు, కెమికల్స్ వంటి ప్రమాదకర పదార్థాలను సరైన రీతిలో డిస్పోజ్ చేయకపోతే భూమి, గాలి, నీరు కలుషితమై భవిష్యత్ తరాలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. గత మూడేళ్లుగా అసెంబ్లీలో మందుల కొరతపై తాము మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇప్పుడు వందల కోట్ల విలువైన మందులు ఎక్స్‌పైరీ అయ్యే వరకు నిల్వ ఉంచడం వెనుక ఉన్న కుట్రను ఛేదించాలన్నారు. ఈ స్కామ్ లో కేవలం చిన్నస్థాయి ఉద్యోగులను బలిపశువులను చేసి పెద్దలను కాపాడాలని చూస్తే ఊరుకునేది లేదని, అధికారులు మరియు రాజకీయ నాయకుల ప్రమేయంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. వైద్యం ఉచితంగా అందాలనే చర్చ ఒకవైపు జరుగుతుంటే, ఇలా నిధులు వృథా కావడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest