Mahaa Daily Exclusive

  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రాష్ట్ర నూతన డీజీపీ సీవీ ఆనంద్ భేటీ…

Share

 

హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా నియమితులైన సీవీ ఆనంద్ బుధవారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో గల స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ భేటీ జరిగింది. రాష్ట్ర పోలీసు బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజా పాలనలో పోలీసు వ్యవస్థ కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యంగా మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళల భద్రత మరియు సైబర్ నేరాల అదుపు విషయంలో కఠినంగా వ్యవహరించాలని, ప్రజలకు పోలీసుల పట్ల భరోసా కల్పించేలా విధులు నిర్వహించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర శాంతిభద్రతల సారథిగా బాధ్యతలు అప్పగించినందుకు సీవీ ఆనంద్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో నేరాల నియంత్రణకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడంపై ప్రాథమికంగా చర్చించారు. నిజాయితీ, అంకితభావంతో పనిచేసి రాష్ట్ర ప్రతిష్టను పెంపొందిస్తానని డీజీపీ ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు , పోలీసు విభాగంలోని పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.