Mahaa Daily Exclusive

  బెంగాల్ ఓట్ల తొలగింపు వివాదంపై సుప్రీం కీలక సూచనలు…

Share

బెంగాల్ ఓట్ల తొలగింపు వివాదంపై సుప్రీం కీలక సూచనలు.
* ఏకంగా 91 లక్షల ఓట్లను తొలగించారన్న తృణమూల్ కాంగ్రెస్.
* 31 స్థానాల్లో ఫలితాలు తారుమారయ్యాయని కోర్టుకు నివేదన.
* ఎలక్షన్ పిటిషన్లు దాఖలు చేసుకోవాలని సూచించిన ధర్మాసనం.
* న్యాయమూర్తుల ముట్టడి కేసులో ఎన్ఐఏ దర్యాప్తునకు రెండు నెలల గడువు.
ఢిల్లీ, మహా.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ముసుగులో భారీగా ఓట్ల తొలగింపు జరిగిందన్న తృణమూల్ కాంగ్రెస్ ఆరోపణలపై సుప్రీంకోర్టు స్పందించింది. ఓట్ల తొలగింపు వల్ల ఎన్నికల ఫలితాలు ప్రభావితమయ్యాయని భావిస్తే.. సంబంధిత విభాగాల్లో ‘ఎలక్షన్ పిటిషన్’ దాఖలు చేసుకోవచ్చని తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీకి సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. సోమవారం ఈ వ్యవహారంపై భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీల ధర్మాసనం విచారణ చేపట్టి ఈ మేరకు స్పష్టం చేసింది.
విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో తృణమూల్ కాంగ్రెస్ తరఫు న్యాయవాదులు కల్యాణ్ బెనర్జీ, మేనక గురుస్వామి తమ వాదనలు వినిపించారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియను సాకుగా చూపి ఏకంగా 91 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా తొలగించారని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అక్రమ ఓట్ల తొలగింపు కారణంగా రాష్ట్రంలోని కనీసం 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలు తారుమారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక స్థానాల్లో గెలుపొందిన అభ్యర్థి మెజారిటీ కంటే, ఎస్ఐఆర్ ద్వారా తొలగించిన ఓట్ల సంఖ్యే ఎక్కువగా ఉందని గణాంకాలతో సహా వివరించారు. ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థి కేవలం 862 ఓట్ల తేడాతో ఓటమి పాలుకాగా, అదే కేంద్రంలో ఎస్ఐఆర్ ద్వారా ఐదు వేలకు పైగా ఓట్లను తొలగించారని తెలిపారు.
బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య మొత్తం ఓట్ల తేడా కేవలం 32 లక్షలు మాత్రమేనని కల్యాణ్ బెనర్జీ ఈ సందర్భంగా కోర్టుకు వివరించారు. మరోవైపు ట్రిబ్యునల్స్ జాప్యంపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తొలగించిన 34 లక్షల మంది ఓటర్ల సమస్యలు ఎస్ఐఆర్ ట్రిబ్యునల్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, వాటి పనితీరును బట్టి చూస్తే వీటిని పరిష్కరించేందుకు కనీసం నాలుగేళ్లు పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే తృణమూల్ ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. ఎస్ఐఆర్ ప్రక్రియ, ఓటర్ల చేర్పులు, తొలగింపులకు సంబంధించిన అప్పీళ్ల విషయంలో పోల్ ప్యానెల్ పూర్తి జవాబుదారీతనంతో పనిచేస్తుందని స్పష్టం చేసింది. ఓట్ల తొలగింపుపై అభ్యంతరాలు ఉంటే చట్టప్రకారం ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేయడమే సరైన మార్గమని ఈసీ వాదించింది.
మరోవైపు మాల్దా జిల్లాలోని మోతాబరిలో న్యాయమూర్తులను ముట్టడించిన సంచలన ఘటనపై కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో విచారణ నివేదికను సమర్పించడానికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు మరింత సమయం కోరారు. దీనిపై స్పందించిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం.. రాబోయే రెండు నెలల్లోగా దర్యాప్తును పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని ఆదేశించడంతో పాటు, నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది.
ఇదిలా ఉండగా.. ఇటీవల ముగిసిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 స్థానాలకు గాను బీజేపీ 207 సీట్లతో ఘన విజయం సాధించి తొలిసారి అధికారంలోకి వచ్చింది. అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ 80 సీట్లకే పరిమితమై ఓటమి పాలైంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో అత్యధికంగా 90 శాతానికి పైగా పోలింగ్ నమోదు కావడం విశేషం.