తమిళనాట ఆసక్తికర పరిణామాలు.
* సీనియర్ నేతలతో సీఎం విజయ్ వరుస భేటీలు.
*మాజీ సీఎం స్టాలిన్, ఎండీఎంకే నేత వైకోలతో మర్యాదపూర్వక సమావేశాలు.
* మరోవైపు ప్రారంభమైన కూటమి లుకలుకలు.. టీవీకే తీరుపై వీసీకే అసంతృప్తి.
*విజయ్ సీఎం కావడంపై నటి త్రిష భావోద్వేగం.
* ‘ప్రేమ ఎప్పుడూ గొప్పదే’ అంటూ పోస్ట్.
హైదరాబాద్, మహా.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దళపతి విజయ్, రాష్ట్రంలోని సీనియర్ రాజకీయ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ద్రవిడ పార్టీలైన డీఎంకే, ఎండీఎంకే అగ్ర నేతలతో ముఖ్యమంత్రి విజయ్ సోమవారం సమావేశం కానున్నారు. మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కే. స్టాలిన్ నివాసానికి స్వయంగా వెళ్లి ఆయనతో విజయ్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు ఎండీఎంకే అధినేత వైకో ఇంటికి వెళ్లి ఆయనతోనూ సమావేశం కానున్నారు. అయితే, ఈ వరుస భేటీల వెనుక ఎలాంటి రాజకీయ వ్యూహాలు లేవని, ఇవి కేవలం మర్యాదపూర్వక కలయికలు మాత్రమేనని అధికార టీవీకే (తమిళగ వెట్రి కళగం) పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
**కూటమిలో అప్పుడే మొదలైన లుకలుకలు**
కొత్త ప్రభుత్వం కొలువుదీరిన ఆనందం ఒకవైపు ఉంటే, తమిళనాడు కూటమి ప్రభుత్వంలో అప్పుడే లుకలుకలు ప్రారంభం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ వ్యవహారశైలిపై మిత్రపక్షమైన వీసీకే (విడుతలై చిరుతైగల్ కట్చి) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇటీవల జరిగిన నూతన ప్రభుత్వ ప్రమాణస్వీకార మహోత్సవంలో ‘వందేమాతరం’ గీతాన్ని పూర్తిగా పాడించడంపై వీసీకే ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర గవర్నర్ మెప్పు పొందేందుకే టీవీకే ఉద్దేశపూర్వకంగా ఈ నిర్ణయం తీసుకుందని వీసీకే నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రమాణస్వీకార వేదికపై టీవీకే వ్యవహరించిన తీరు తమకు ఏమాత్రం రుచించలేదని వీసీకే బహిరంగంగానే విమర్శలు గుప్పించడం కూటమిలో అంతర్గత విభేదాలకు అద్దం పడుతోంది.
**విజయ్ విజయంపై త్రిష భావోద్వేగం**
ఒకవైపు రాజకీయ పరిణామాలు వేగంగా మారుతుండగా, మరోవైపు సినీ వర్గాల్లోనూ విజయ్ ముఖ్యమంత్రి కావడంపై ఆసక్తికర వాతావరణం నెలకొంది. తన తోటి నటుడు, ఆప్తమిత్రుడు విజయ్ సీఎం పీఠం అధిరోహించడంతో ప్రముఖ నటి త్రిష తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆమె “ప్రేమ ఎప్పుడూ గొప్పదే..” అంటూ సోషల్ మీడియాలో పెట్టిన తాజా పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. విజయ్, త్రిషల జోడీ కోలీవుడ్‌లో ఎంతటి సంచలనమో అందరికీ తెలిసిందే. వీరిద్దరూ జంటగా నటించిన ఐదు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లుగా నిలిచి ప్రేక్షకులను అలరించాయి. కాగా, వీరి తొలి సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని సినీ విమర్శకులు తరచూ వ్యాఖ్యానిస్తుంటారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న విజయ్‌ను ఉద్దేశించి త్రిష చేసిన పోస్ట్ అభిమానుల్లో విశేషంగా ఆకర్షిస్తోంది.







