ఎవరి ఒత్తిళ్లకూ.. ఆంక్షలకూ భారత్ తలొగ్గదు.
*పోఖ్రాన్ అణుపరీక్షలతోనే ప్రపంచానికి మన సత్తా చాటాం
*విధ్వంసకారుల దాడులను తట్టుకుని సగర్వంగా నిలబడ్డ సోమనాథ్.
*చంద్రయాన్ దిగిన చోటుకు ‘శివశక్తి’ పేరు అందుకే.
*సోమనాథ్ ఆలయ 75వ పునర్నిర్మాణ వేడుకల్లో ప్రధాని మోదీ ఉద్ఘాటన.
*రూ. 75 స్మారక నాణెం, పోస్టల్ స్టాంప్ విడుదల.. రోడ్‌షోకు బ్రహ్మరథం.
సోమనాథ్ (గుజరాత్),మహా.
పవిత్ర ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం సోమనాథ్ మహాదేవ్ ఆలయం వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత దేశ సత్తాను, పరాక్రమాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు. ప్రపంచంలో ఏ దేశం ఒత్తిళ్లకు, ఆంక్షలకు తలొగ్గే ప్రసక్తే లేదని భారత్ ఏనాడో నిరూపించిందని ఆయన ఉద్ఘాటించారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం ఘనంగా నిర్వహించిన ‘అమృత్ మహోత్సవం’లో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకల వేదికగా 75 ఏళ్ల పునర్నిర్మాణానికి గుర్తుగా రూ. 75 స్మారక నాణేన్ని, ప్రత్యేక పోస్టల్ స్టాంపును ప్రధాని ఆవిష్కరించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల అనంతరం సద్భావన మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
సరిగ్గా ఇదే రోజు (మే 11) 1998లో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో పోఖ్రాన్లో అణు పరీక్షలు నిర్వహించి భారత్ సత్తా ఏమిటో ప్రపంచాన్ని విస్మయానికి గురిచేశామని మోదీ గుర్తుచేశారు. ఆ తర్వాత మే 13న మరో రెండు అణుపరీక్షలు చేశామని తెలిపారు. ఆ సమయంలో అగ్రరాజ్యాలు మనపై ఎన్నో ఆంక్షలు విధించి ఇబ్బందులకు గురిచేసినా, మనం ఏమాత్రం భయపడలేదని, ఎవరికీ తలొగ్గకుండా అత్యంత ధైర్యంగా నిలబడ్డామని ప్రధాని స్పష్టం చేశారు. మన వేలాది ఏళ్ల ఆధ్యాత్మిక చైతన్యానికి సోమనాథ్ ఆలయమే సజీవ సాక్ష్యమన్నారు. చరిత్రలో గజనీ, ఖిల్జీ లాంటి విధ్వంసకారులు ఈ ఆలయ సంపదను ఎన్నోసార్లు దోచుకున్నారని, ఎన్నెన్ని దాడులు చేసినా ఈ దేవాలయం నేడు సగర్వంగా నిలబడిందని మోదీ కొనియాడారు. భారతీయ ఆధ్యాత్మిక శక్తి గురించి ఆ విధ్వంసకారులకు తెలియదని, అసత్యంపై ఎప్పటికైనా సత్యానిదే విజయమని మన పూర్వీకులు నిరూపించారని ఆయన ఉద్ఘాటించారు. 1951లో ఆలయ పునర్నిర్మాణం చేపట్టామని, పవిత్ర సోమనాథ్ దేవాలయ రూపురేఖలను నేడు పూర్తిగా మారుస్తున్నామని, ఆలయ అభివృద్ధికి సాక్షాత్తు పరమశివుడి ఆశీస్సులు ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు. ప్రాచీన సంస్కృతిని, వారసత్వాన్ని కూడా భారత్ సగర్వంగా పరిరక్షించుకుంటుందనడానికి ఈ పునర్నిర్మాణ పనులే నిదర్శనమన్నారు.
ఆధ్యాత్మికతకు, ఆధునిక శాస్త్ర సాంకేతికతకు ఉన్న అనుబంధాన్ని ప్రధాని ఈ సందర్భంగా ఆసక్తికరంగా వివరించారు. జాబిల్లిపైకి విజయవంతంగా పంపిన ‘చంద్రయాన్’ ప్రాజెక్టులో మన రోవర్ దిగిన ప్రాంతానికి ‘శివశక్తి పాయింట్’ అని నామకరణం చేశామని ఆయన గుర్తుచేశారు. పరమశివుడికి, చంద్రుడికి మధ్య ఉన్న అవినాభావ సంబంధానికి ప్రతీకగానే ఆ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. అంతకుముందు ప్రధాని మోదీ సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరమేశ్వరునికి మహా పూజ, అభిషేకం, ధ్వజ పూజల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణానికి ఆద్యుడైన ‘ఉక్కు మనిషి’ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన కుంభాభిషేక క్రతువులోనూ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా భారతీయ వాయుసేనకు చెందిన ‘సూర్యకిరణ్’ బృందం ఆకాశంలో చేసిన సాహసోపేత విన్యాసాలు చూపరులను అబ్బురపరిచాయి. ఈ వేడుకల్లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ తదితరులు పాల్గొన్నారు.
ప్రధాని మోదీ రాక సందర్భంగా సోమనాథ్ పురవీధులు జనసంద్రంగా మారాయి. హెలిప్యాడ్ నుంచి వీర్ హమీర్జీ సర్కిల్ వరకు సుమారు కిలోమీటరున్నర మేర సాగిన ప్రధాని రోడ్‌షో అత్యంత అట్టహాసంగా సాగింది. దారిపొడవునా జాతీయ జెండాలు చేతబూనిన వేలాది మంది ప్రజలు ‘మోదీ’ నామస్మరణతో ఘన స్వాగతం పలికారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బెంగాల్ జానపద కళాకారుల సంప్రదాయ నృత్యాలు ఈ రోడ్‌షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 1951లో భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ పునర్నిర్మిత ఆలయాన్ని ప్రారంభించగా, ఆ చారిత్రక ఘట్టానికి 75 వసంతాలు పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వ, పీఠం ఆధ్వర్యంలో ఈ అమృత్ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.








